కోసిగి: స్థానిక రైల్వే గేటు సమీపంలోని సిద్దరూఢ కాలనీ వాసులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ కాలనీవాసుల కోసం పంచాయతీ అధికారులు దొరల జిల్లా ఎదురుగా తాగునీటి మినీ గుమ్మీని ఏర్పాటు చేశారు. ఆ ట్యాంక్‌కు రెండు రోజులకోసారి నీటిని వదులుతున్నారు. ఆ నీరు కూడా సక్రమంగా వదలక పోవడంతో తాగునీటి సమస్య తీవ్రమైందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. నీటిని ఎప్పుడు వదులుతారో తెలియకపోవడంతో ఖాళీ బిందెలను వరుస క్రమంలో ఉంచి వెళుతున్నారు. నీటి కోసం పనులు మానుకుని పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విన్నవించినా తాగునీటి సక్రమంగా వదలడం లేదని ఆ కాలనీ వాసులు ఆరోపించారు. వేసవి కావడంతో నీటి సమస్య తీవ్రంగా మారిందని, అధికారులు తగు చర్యలు తీసుకొని సమస్య పరిష్కరించాలని ఆ కాలనీ వాసులు కోరుతున్నారు.


