ప్రజలకు వంట గ్యాస్ కష్టాలు తీరడం లేదు. మంగళవారం హొళగుందలో భారత్ గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో గంటల తరబడి పడిగాపులు కాశారు. ఆదోని నుంచి హొళగుందకు 12 గంటల సమయంలో సిలిండర్ల వాహనం రావడంతో వినియోగదారులు ఎగబడ్డారు. బుకింగ్ చేసుకుని డెలివరీ మెసేజ్ వచ్చిన వారికి మాత్రమే సిలిండర్లు లభించాయి. గతంలో మెసేజ్ రాని వారికి కూడా సిలిండర్లు అందేవని ప్రస్తుతం ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. గంటల తరబడి వేచి చూసినా కొందరికి సిలిండర్లు దొరక్కపోవడంతో నిరాశతో ఇంటి దారి పట్టారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.970 ఉండగా రవాణా చార్జీ కింద అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. బ్లాక్‌లో వ్యాపారం చేసుకునే కొందరు పదుల సంఖ్యలో సిలిండర్లను బుకింగ్ చేసుకుని తీసుకెళ్తున్నారని, దీనివల్ల గ్యాస్ సమస్య వస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి ఇంటింటికీ గ్యాస్ సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. – హొళగుంద


