ఆదోని సెంట్రల్: ఆదోని పట్టణంలోని హనుమాన్ నగర్‌లో ఉన్న శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల పైకప్పు పెచ్చులూడి ఇద్దరు విద్యార్థులు గాయాలపాలయ్యారు. శుక్రవారం పాఠశాలకు సెలవు ఉన్నప్పటికీ స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులను పాఠశాలకు పిలిపించి విద్యాబోధన అందిస్తున్నారు. తరగతులు నిర్వహిస్తున్న సమయంలో పైకప్పు పెచ్చులూడి పడడంతో అరవింద్, చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. స్పందించిన ఉపాధ్యాయులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలను పర్యవేక్షించి వాటిని సరి చేయాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రిమినల్ కేసు నమోదు చేయాలి...
ఆదోనిలో నిబంధనలకు విరుద్ధంగా చదువులు కొనసాగించిన శ్రీ బాలాజీ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. పైకప్పు పెచ్చులూడి గాయాలపాలై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్‌ఎఫ్‌ఐ పట్టణాధ్యక్ష, కార్యదర్శులు సంజయ్, శశిధర్ పరామర్శించారు.


