కర్నూలు(సెంట్రల్): జిల్లాలో 52 శాఖలకు సంబంధించి రూ.2833 కోట్లతో అవుట్‌రీచ్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఇన్‌చార్జ్ మంత్రి అధ్యక్షతన 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, ఎమ్మెల్యేలు పార్థసారథి, బొగ్గుల దస్తగిరి, జయ నాగేశ్వరరెడ్డి, కేఈ శ్యామ్‌కుమార్, జేసీ నూరుల్ ఖమర్‌తోపాటు వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, చైర్మన్లు హాజరయ్యారు. ఇన్‌చార్జ్ మంత్రి మాట్లాడుతూ.. బడ్జెట్ అవుట్ రీచ్‌లో రూరల్ డెవలప్‌మెంట్, వైద్యం, విద్య, పాఠశాల విద్య, పీఆర్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్లకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. ఇవే కాక సూపర్‌సిక్స్‌లో రూ.2394 కోట్లను జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. త్వరలోనే పశ్చిమ ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. బడ్జెట్ అవుట్ రీచ్‌పై ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.
వ్యక్తిపై గొడ్డలితో దాడి
హొళగుంద: హొళగుంద పోలీస్ స్టేషన్ పరిధిలోని నెరణికి తండాకు చెందిన రామునాయక్‌పై అదే గ్రామానికి చెందిన రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేయడంతో తీవ్రంగా గాయాలైనట్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ మంగళవారం తెలిపారు. రామునాయక్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో రాఘవేంద్రనాయక్ గొడ్డలితో దాడి చేసినట్లు ఎస్‌ఐ వెల్లడించారు. ప్రస్తుతం రామునాయక్ ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాఘవేంద్రనాయక్‌పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ దిలీప్ కుమార్ వెల్లడించారు.
వాహనం ఢీకొని జింక మృతి
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని కల్లుదేవకుంట సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. ఎమ్మిగనూరు టూ మంత్రాలయం జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి జింక కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. జింక కళేబరానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం ఖననం చేస్తామని ఎఫ్‌బీఓ నాగేష్ తెలిపారు.
మద్యం మత్తులో వీరంగం కేసులో ఏడాది జైలు శిక్ష
బేతంచెర్ల: పట్టణంలోని కొత్త బస్టాండులో మద్యం సేవించి మారణాయుధం పట్టుకొని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారని సీఐ వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. వివరాలు.. పట్టణంలోని శేషారెడ్డి నగర్‌కు చెందిన కే.నాగ శేషు 2018లో మద్యం సేవించి కొత్త బస్టాండులో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుండటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. అప్పటి ఎస్‌ఐ తిరుపాలు ఘటనా స్థలానికి చేరుకొని మారణాయుధాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. డోన్ కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడు నాగశేషుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరు పరచడంలో కృషిచేసిన సీఐ వెంకటేశ్వరరావు, కోర్టు కానిస్టేబుల్ మాధవ్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.


