మీకోసం ‘కరువు’ మాట! | - | Sakshi
Sakshi News home page

మీకోసం ‘కరువు’ మాట!

Mar 23 2026 8:50 AM | Updated on Mar 23 2026 8:50 AM

కర్నూలు(అగ్రికల్చర్‌): రానున్నది కరువు కాలం.. వర్షాలు పడే పరిస్థితి లేదు.. ముందుగానే హెచ్చరిస్తున్నాం.. కరువు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.. ఈ మాటలు రైతులకు చెప్పేందుకు చంద్రబాబు ప్రభుత్వం మరోసారి రైతన్న మీకోసం అంటూ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎల్‌నినో ప్రభావంతో జూన్‌ నుంచి ఆగష్టు వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని, ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని అధికారులతో చెప్పిస్తోంది. ఇందు కోసం కరపత్రాలను సైతం ముద్రించి రైతులకు అందిస్తోంది. ‘మేం ముందుగానే హెచ్చరిస్తున్నాం.. కరువు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆదుకోవాలంటే సాధ్యం కాదని’ హెచ్చరిస్తోంది.

‘పంచమ’ వంచన

రైతన్న– మీకోసం కార్యక్రమాలు ఈ నెల 16 నుంచి 25 వరకు నిర్వహించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలో 16, 17, 18 తేదీల్లో తూతూమంత్రంగా కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని 410 రైతుసేవా కేంద్రాల పరిధిలో రోజుకు 90 ఇళ్ల(అంటే 30 క్లస్టర్లు)ను సందర్శించాల్సి ఉంది. రైతులతో వ్యవసాయ సిబ్బంది చర్చించాల్సి ఉంది. అయితే వ్యవసాయ, అనుబంధ శాఖల ఉద్యోగులు రైతులకు చంద్రబాబు సందేశం ఉన్న కరపత్రాలు ఇచ్చి ఫొటోలు దిగడం వరకే పరిమితం అయ్యారు. ఉగాది, రంజాన్‌ ఆదివారం సెలవులు కారణంగా 19 నుంచి 22వ తేదీ వరకు నాలుగు రోజులు అధికారులకు విరామం వచ్చింది. పేరుకు ముఖ్యమంత్రి పంచ సూత్రాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో ఉత్పన్నమయ్యే కరువును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలియచెప్పేందుకే ఈ కార్యక్రమమని వ్యవసాయ అధికారులే చెబుతున్నారు.

వ్యవసాయానికి గడ్డుకాలమే!

ఎల్‌నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు సకాలంలో రాకపోవచ్చు అని రైతులకు కొందరు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఖరీఫ్‌లో విత్తనం వేసుకోవడం ఆలస్యం అవుతుందని, పంటకాలం మారిపోయి దిగుబడులు పడిపోయే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో నేలలోని తేమను త్వరగా ఆవిరై మొక్కలు ఎండిపోయి పచ్చదనం అంతరించి పోతుందని హెచ్చరిస్తున్నారు. కరువు వస్తే ప్రాజెక్టుల్లో నీటిమట్టం అడుగంటిపోతుంది. చెరువుల్లో చుక్క నీరు ఉండదు. వర్షాధార పంటలకే కాదు... నీటి ఆధారిత పంటలైన వరి సాగుకు గడ్డుకాలం ఏర్పడుతుందని రైతులు పెదవి విరుస్తున్నారు.

రైతుల అనుమానాలు ఇవీ..

కరువు వస్తుందని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోందని, అయితే అందుకు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. మంచినీటికి ఇబ్బందులు లేకుండా ఇప్పటి వరకు జిల్లాలో చెరువులను నింపలేదని గర్తుచేసుకుంటున్నారు. కరువు వస్తే 75 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తామని హామీ ఇవ్వడం లేదని, రైతులకు విరివిగా సాయం అందిస్తామని మాట రావడం లేదని, ఇవేం సమావేశాలు అని విమర్శిస్తున్నారు.

నిరసనలు.. నిలదీతలు

చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుగా రైతుల కోసం చేసింది ఏమీ లేదు. 2024–25లో అన్నదాత సుఖీభవ ఎత్తేసి 2025–26లో అరకొరగా అమలు చేసింది. మొంథా తుపాన్‌ వచ్చి పంటలు నష్టపోయినా పరిహారం ఇవ్వలేదు. ఇటీవల రైతుభరోసా కింద సాయం అందించినా కౌలు రైతులను పట్టించుకోలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో లబ్ధిపొందిన వారిలో 21,841 మంది రైతులకు మొండిచెయ్యి చూపారు. ‘మేం అసైన్డ్‌ భూములను అనుభవిస్తున్నాం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్ల రైతుభరోసా ఇచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు’ అని టీడీపీ నేతలు, అధికారులను పలుచోట్ల మహిళలు నిలదీశారు. మొక్కజొన్న, సజ్జ, కొర్ర, ఉల్లి, వేరుశనగ, మినుము ఇలా అన్ని పంటలకు ధరలు లేవని, ఏం చేస్తున్నారని కొందరు రైతులు నిరసన తెలిపారు. మద్దతు ధరతో మొక్కజొన్నను కొనుగోలు చేసిన దాఖలాలే లేవని మండిపడ్డారు. వచ్చే ఖరీఫ్‌లోనూ యూరియా కోసం కష్టాలు పడే సూచనలు కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

రైతన్న– మీకోసంలో

అధికారుల కొత్త పల్లవి

ఎల్‌నినో ప్రభావం ఉంటుందని

ముందస్తు హెచ్చరిక

వర్షాలు పడవని..

ఆరుతడి పంటలు

సాగు చేయాలని సూచన

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు

కార్యక్రమాల నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement