ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

ఓర్వకల్లులో 18 బైకులు దగ్ధం

Mar 23 2026 8:50 AM | Updated on Mar 23 2026 8:50 AM

ఓర్వకల్లు: మెకానిక్‌ వద్దకు తీసుకొచ్చిన 18 బైకులు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. ఓర్వకల్లులోని ఓ మెకానిక్‌ షెడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకొంది. స్థానికుల వివరాల మేరకు.. తిప్పాయపల్లె గ్రామానికి చెందిన శంకర్‌ అనే వ్యక్తి కొన్నేళ్లుగా ఓర్వకల్లు బస్టాండ్‌ సమీపాన మెకానిక్‌ షాపు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం షాపు వద్దకు వచ్చి, రాత్రి ఇంటికి వెళ్లేవాడు. ఆదివారం తెల్లవారు జామున ఓ బైక్‌ నుంచి మంటలు వ్యాపించి మొత్తం 18 దగ్ధమైనట్లు స్థానికులు చెప్పారు. సమీపంలోని ట్యాంకర్‌ ద్వారా నీటితో అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. దుండగుల దుశ్చర్య అనే విషయాలు తెలియరాలేదు.

పొగాకు రైతు మృతి

ఓర్వకల్లు: పండించిన పొగాను కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో గుండెపోటుతో రైతు షఫీఖాన్‌(55) మృతి చెందాడు. ఈ ఘటన నన్నూరు గ్రామంలో ఆది వారం చోటు చేసుకొంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన షఫీఖాన్‌ అనే వ్యక్తి గ్రామంలో కొందరి రైతుల వద్ద 16 ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. అందులో 10 ఎకరాల్లో పొగాకు సాగుచేశాడు. ఈ ఏడాది పొగాకు బాగా అమ్ముడు పోతుందని, అప్పులు తీరిపోతాయని ఆశించాడు. దిగుబడి బాగానే వచ్చినప్పటికీ, పొగాకు కంపెనీలు సక్రమంగా కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురై ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. వ్యవసాయానికి, వివిధ అవసరాలకు రూ.10 లక్షలు అప్పుచేసినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య నజిమాబీ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు.

రీసర్వే సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కర్నూలు(సెంట్రల్‌): రీసర్వేతో వచ్చిన భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్‌ చేశారు. సీఆర్‌ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రీసర్వే తప్పులను సరిచేసుకోవడానికి అన్నదాతలు అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. చాలా చోట్లా విస్తీర్ణాన్ని ఎక్కువ, తక్కువ చేసి చూపుతున్నారని, ఇలా ఎందుకు జరిగిందో కూడా అధికారులు సరైన సమాధానాలు చెప్పడంలేదన్నారు. ముఖ్య ంగా జాయింట్‌ ఎల్‌పీఎంలు, ఇనామ్‌ భూమల సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. వాటి పరిష్కారం కోసం అన్నదాతలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడంలేదని, ప్రభుత్వం తన మొండి వైఖరిని మార్చుకోకపోతే పోరాటాలకు పిలుపునిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, బి.శ్రీనివాసరావు, మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement