కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి ఆలయంలో ఈనెల 25న హుండీల్లో కానుకల లెక్కింపు ఉంటుందని ఆలయ డిప్యూటీ కమిషనర్ వాణి తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో పోలీస్ బందోబస్తు మధ్య హుండీలను తెరిచి లెక్కిస్తామని చెప్పారు.
కుందూలో గల్లంతైన
వ్యక్తి మృతదేహం లభ్యం
జమ్మలమడుగు రూరల్: పెద్దముడియంలోని కుందూ నదిలో శనివారం గల్లంతైన గొడుగు సురేష్ (41) మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన గొడుగు సురేష్ అనే వ్యక్తి పెద్దముడియంలో జరుగుతున్న ఎడ్ల పోటీలను తిలకించడానికి శనివారం వచ్చాడు. మధ్యలో కుందూ నదిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో నదిలో గల్లంతయ్యాడు. పోలీసులు ఎంత గాలించినా అతని జాడ కనిపించలేదు. ఆదివారం మృతదేహం లభ్యమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పెద్దముడియం పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోడుమూరు రూరల్: కోడుమూరు – వెల్దుర్తి రహదారిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కృష్ణగిరి మండలం పోతుగల్లుకు చెందిన బోయ శ్రీనివాసులు (36) కోడుమూరుకు చెందిన మంజులను వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆదివారం వ్యక్తిగత పనిమీద శ్రీనివాసులు బైక్‌పై వెంకటగిరి గ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అదే సమయంలో అల్లినగరం గ్రామానికి చెందిన బోయ గిరి తన ఆటోలో కోడుమూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా కోడుమూరు శివారులో ప్రమాదవశాత్తూ ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం కర్నూలు తరలిస్తుండగా బోయ శ్రీనివాసులు మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కోడుమూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


