27న చలో విజయవాడ
కర్నూలు(సెంట్రల్): విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 27వ తేదీన చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు పీడీఎస్‌యూ జిల్లా ఉపాధ్యక్షుడు రమణకుమార్ తెలిపారు. ఈమేరకు ఆదివారం రాయలసీమ యూనివర్సిటీ మెయిన్ గేటు దగ్గర చలో విజయవాడకు సంబంధించిన పోస్టర్లను పీడీఎస్‌యూ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.8 వేల కోట్ల ఫీజు బకాయిల్లో ఇటీవల రూ.1200 కోట్లు విడుదల చేశారని, మిగిలిన వాటిని ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అలాగే జీఓ నంబర్ 77 ను రద్దు చేస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చినా నేటికి రద్దు కాకపోవడంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని చెప్పారు. వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు, మెస్ చార్జీల పెంపుపై మంత్రి ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు చెప్పారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరుకావాలని పిలుపునిచ్చారు. పీడీఎస్‌యూ ఆర్‌యూ నాయకులు అమర్, రవి, సుధాకర్, మధు పాల్గొన్నారు.


