అమరజీవి త్యాగం మరువలేనిది
● జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం అజరామరమని జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో అమరజీవి చిత్ర పటానికి జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డితో కలిసి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు స్వాతంత్య్ర ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారని, గాంధేయవాది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించిన మహనీయులన్నారు. ఆయన మృతితోనే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అప్పటి నుంచి ఆయనను తెలుగు ప్రజలు అమరజీవిగా గౌరవించుకుంటున్నారని చెప్పారు. జెడ్పీ పరిపాలనాధికారులు సీ మురళీమోహన్‌రెడ్డి, పుల్లయ్య, జితేంద్ర, నాగేంద్ర ప్రసాద్, బసవశేఖర్, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుపై అవగాహన
కర్నూలు(సెంట్రల్): విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలని విద్యుత్ శాఖాధికారులను కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఇంధన పరిరక్షణ, సంరక్షణకు సంబంధించిన పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఈ నెల 14 నుంచి ప్రారంభమైన ఇంధన పొదుపు వారోత్సవాను 20వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం ఇంధన పరిరక్షణ, సంరక్షణపై జిల్లా అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జేసీ నూరుల్ ఖమర్, ఎపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ప్రదీప్, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ పాల్గొన్నారు.
తుంగభద్ర నదిలో ఇసుక దొంగలు!
నందవరం: టీడీపీ నేతల సహకారంలో తుంగభద్ర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. మొన్నటి వరకు నాగలదిన్నె నుంచి ఇసుక్రను చోరీ చేశారు. తుంగభద్ర నది నీరు రావడంతో మూడు రోజుల నుంచి చిన్నకొత్తిలి గ్రామంలోని నది ఒడ్డుకు వచ్చారు. యదేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నా అధికారులు స్పందించడం లేపదు. ప్రభుత్వ కార్యాలయాల మీదుగా ఇసుక ట్రాక్టర్లు తరలిపోతున్నా చర్యలు శూన్యం. నందవరం మండలంలో నాగలదిన్నె, చిన్నకొత్తిలి, గంగవరం, కనకవీడు, సోమలగూడూరు మీ దుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. చిన్నకొత్తిలి, నాగలదిన్నె గ్రామాలకు నుంచి రోజుకు 25 నుంచి 50 ట్రిప్పుల వరకు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక మాఫియాకు అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.
కలెక్టరేట్ ఎదుట ఉల్లి రైతుల ధర్నా
కర్నూలు(సెంట్రల్): తాము కర్నూలు మార్కెట్‌లో మూడున్నర నెలల క్రితం ఉల్లిని అమ్మామని, ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పత్రాలను చూపారు. సీబెళగల్ మండలం సంగాలకు చెందిన 30 మంది రైతులు సోమవారం కర్నూలులోని కలెక్టరేట్‌కు వచ్చారు. తాము ఉల్లిని సాగు చేసి గిట్టుబాటు ధరలు లేక దీన స్థితిలో ఉన్నామని, దయ ఉంచి రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న డబ్బులు విడుదల చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరికి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రైతులు రామాంజనేయులు, చిన్న లక్ష్మన్న, సుంకన్న మాట్లాడుతూ.. గ్రామంలో దాదాపు 30 మంది రైతులకు సంబంధించి రూ.50 లక్షలు రావాల్సి ఉందని, అదిగో..ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారన్నారు.
అమరజీవి త్యాగం మరువలేనిది
అమరజీవి త్యాగం మరువలేనిది


