టీడీపీ నేతలు.. ఇసు‘కాసు’రులు
గోనెగండ్ల: ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతలు చెలరేగిపోతున్నారు. వారికి ఉచిత ఇసుక వరంగా మా రింది. రాత్రి, పగలు అనే తేడాలేకుండా ట్రాక్టర్లలో ఆదోని, ఎమ్మిగనూరు మండల పరిధిలోని గ్రామాలకు ఇసుక తరలించి అమ్ముకుంటున్నారు. గంజిహళ్లి దగ్గర ఉన్న హంద్రీనదిని తోడేస్తున్నారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, తదితర ప్రాంతాల వారు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. దీంతో గంజిహళ్లి గ్రామంలో రోడ్లు దెబ్బతుంటున్నాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు పది ట్రాక్టర్లను ఇసుక కోసం వాడుతున్నారు. ఈ విధంగా హంద్రీ నదిలోని ఇసుకను తరలిస్తే భూ గర్భజలాలు అడుగంటి పోయి వేసవిలో తాగునీటి సమస్య వస్తుందని గ్రామస్తులు తెలుపుతున్నారు.
పోలీసులను బురిడీ కొట్టించి..
ఇసుక రవాణా జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు శనివారం ఉదయం హంద్రీనది దగ్గరకు వెళ్లారు. పోలీసులు వస్తున్నారని తెలుసుకుని ముందుగానే ఇసుకతో ట్రాక్టర్లలో పరారయ్యారు. మరికొందరు ఇసుకను ఆన్‌లోడ్ చేసి పారిపోయారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటామని గోనెగండ్ల ఇన్‌చార్జ్ సీఐ చిరంజీవి హెచ్చరించారు.


