సాయుధ దళాల సేవలు అజరామరం
● జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రత్నరూత్
కర్నూలు(అర్బన్): సాయుధ దళాల సేవలు అజరామరం అని జిల్లా సైనిక సంక్షేమ అధికారి రత్నరూత్ అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆదివారం సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. కర్నూలులోని అవుట్ డోర్ స్టేడియం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ కొండారెడ్డిబురుజు వరకు సాగింది. జిల్లా స్పోర్ట్స్ అధారిటీ ఆప్ ఇండియా, జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రత్నరూత్ మాట్లాడుతూ విజయదివస్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ రక్షణ శాఖ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో యోగా, రోప్ స్కిప్పింగ్, సైకిలింగ్ వంటి కార్య కలాపాలను నిర్వహిస్తున్నారన్నారు. దేశంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో సైకిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు అధిక ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం తప్పనిసరిగా చేయలన్నారు. సైకిల్ ర్యాలీలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి కార్తికేయన్, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కే బాబురాజు, కార్యాలయ పర్యవేక్షకులు మహేంద్రమ్మ, మాజీ సైనికులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


