76 మంది సచివాలయ ఉద్యోగులకు నోటీసులు
కర్నూలు(అగ్రికల్చర్): పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి నోటీసులు జారీ చేశారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం 7 గంటలకు లాగిన్ అయి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. ఈ నెల 1న 76 మంది సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. దీంతో 5000 మంది పింఛన్లు ఆలస్యంగా పొందారు. వీరికి జిల్లా కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.
‘పది’లో వంద శాతం ఫలితాలకు ప్రత్యేక చర్యలు
కర్నూలు (అర్బన్): ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లోని 10వ తరగతి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులయ్యేందుకు ఇప్పటినుంచే ప్రత్యేక చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సాధికారత అధికారిణి కె.ప్రసూన ఆదేశించారు. ఆదివారం సాయంత్రం సంక్షేమ భవన్‌లోని తన చాంబర్ నుంచి జిల్లాలోని ప్రీ మెట్రిక్ వసతి గృహ సంక్షేమ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో పరీక్షలంటే భయం పోగొట్టాలన్నారు. ప్రతిరోజూ హాస్టళ్లలో స్లిప్ టెస్టులు నిర్వహించాలని సూచించారు. విద్యార్థులను గ్రేడ్‌లుగా విభజించి చదివించాలన్నారు. సహాయ సంక్షేమాధికారి శ్రీనివాసులు, హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాలేగార్ సత్యనారాయణ రాజు, వసతి గృహ సంక్షేమాధికారులు రమేష్, సంపత్ కుమార్ పాల్గొన్నారు.
ప్రారంభానికి ‘చంద్ర’ గ్రహణం
తుగ్గలి: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గ్రామగ్రామానా లక్షలాది రూపాయలతో సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్ క్లినిక్‌లు నిర్మించారు. వాటిలో ఎన్నికల ముందే చాలా చోట్ల భవనాలు ప్రారంభించారు. మరికొన్ని చోట్ల చివరి దశలో ఉన్న నిర్మాణాలు పూర్తయి నెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోవడం లేదు. చెన్నంపల్లిలో గ్రామ సచివాలయం, హెల్త్ క్లినిక్, ఎద్దులదొడ్డిలో సచివాలయం భవనాలు నిర్మాణ పూర్తయినా ప్రారంభం కాలేదు. దీంతో ఎద్దులదొడ్డిలో ఆర్‌బీకే, చెన్నంపల్లిలో పాత పంచాయతీ కార్యాలయంలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సిద్ధంగా భవనాలను వెంటనే ప్రారంభించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రాకపోక..నరకయాతన
వెల్దుర్తి: మండల కేంద్రమైన వెల్దుర్తి నుంచి కర్నూలు వైపు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న రైల్వే అండర్ పాస్ వద్ద నీరు నిల్వ ఉండి ప్రమాదకరంగా మారింది. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలువ మూసుకుపోయి మురుగంతా అండర్‌పాస్ వైపు మళ్లుతోంది. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. రైల్వే అధికారులు కొత్త డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సి ఉంది. అలాగే నీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలి.
76 మంది సచివాలయ ఉద్యోగులకు నోటీసులు
76 మంది సచివాలయ ఉద్యోగులకు నోటీసులు


