యువకుడి అవయవదానం
ఆత్మకూరు: రహదారి ప్రమాదంలో తీవ్రంగా గాయపడి యువకుడు ప్రశాంత్ మృతి చెందడంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు. ఆత్మకూరు పట్టణం తోటగిరిలో నివాసం ఉంటున్న ప్రశాంత్ అనే యువకుడు గత శుక్రవారం హుసేనాపురంలో బంధువుల దగ్గరికి వెళ్లి తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ యువకుడు కర్నూలు నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు అవయవదానం చేశారు. ప్రశాంత్ గుండెను తిరుపతికి, ఊపిరితిత్తులు బెంగళూరుకు, కిడ్నీలు కర్నూలుకు, లివర్ అనంతపురానికి, కళ్లు కర్నూలు వైద్యశాలలకు అందజేశారు. ఆదివారం మృతదేహాన్ని ఆత్మకూరుకు చేర్చి అంత్యక్రియలు నిర్వహించారు. పాములపాడు మండలం భానుముక్కల టర్నింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో ప్రశాంత్ తలకు తీవ్ర గాయాలై చికిత్స ఫలించక మృతిచెందాడని సీఐ రాము తెలిపారు. ప్రశాంత్ మృతి కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు.
వామ్మో.. చలి!
హొళగుంద: గత కొద్ది రోజులుగా విపరీతమైన చలితో ప్రజలు అల్లాడిపోతున్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల క్రితం ఉదయం 29 డిగ్రీల ఉష్ణోగత్రలు ఉండగా ప్రస్తుతం 16 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో ప్రజలు వణికిపోతున్నారు. ఆస్తమా రోగులకు శ్వాస తీసుకోవడంలో అవస్థ తప్పడం లేదు. మరికొద్ది రోజులు రోగులు, చిన్న పిల్లలతో పాటు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ముఖం, ముక్కు, చెవులు కప్పేలా దుస్తులు ధరించాలని డాక్టర్ న్యూటన్ తెలిపారు. పిల్లలకు ఊపిరితిత్తులో నెమ్ము చేరే అవకాశాలుండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
యువకుడి అవయవదానం


