ఊరూరా ఉద్యమంలా..
భారీగా తరలి రండి
● వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పూర్తయిన కోటి సంతకాల సేకరణ
● కర్నూలులో నేడు భారీ ర్యాలీ ● ●తరలిరానున్న ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
కర్నూలులో నేడు భారీ ర్యాలీ
పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు కర్నూలు నగరంలో సోమవారం భారీ ర్యాలీ చేపడుతున్నారు. ఉదయం 10 గంటలకు ఎస్‌టీబీసీ కళాశాల నుంచి ఐదు రోడ్ల కూడలి మీదుగా రాజ్ విహార్ వరకు ర్యాలీ చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ సమన్వయకర్తలు, పార్లమెంట్, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. ర్యాలీ అనంతరం అన్ని నియోజకవర్గాల నుంచి కర్నూలుకు తరలి వచ్చిన సంతకాల వినతి పత్రాల బాక్సులను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలిస్తారు.
కర్నూలు (టౌన్): ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిన ప్రైవేటీకరణ చేయడాన్ని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. వివిధ దశల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టింది. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో రచ్చబండ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది. గ్రామ స్థాయి నుంచి ఈ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మార్చింది. ప్రజలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గమనించిన చంద్రబాబు సర్కార్ వైఎస్సార్‌సీపీ కార్యక్రమాలను పోలీసులతో ఇబ్బందులు సృష్టించింది. పలు నిరసన కార్యక్రమాలకు హాజరు కాకుండా వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు జారీ చేసింది. అయినా ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరు బాట పట్టింది. గత అక్టోబర్ నెల 10న కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పూర్తి స్థాయిలో ఫార్మెట్‌ను తయారు చేసి ఇంటింటికి తిరిగి ప్రజల అభిప్రాయాన్ని సేకరించింది. ఇలా జిల్లా వ్యాప్తంగా 60 రోజులు నిర్వహించింది. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. జిల్లాలో రెండు నెలల పాటు నిర్విఘ్నంగా సాగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తుది దశకు చేరుకుంది.
4.12 లక్షల సంతకాల సేకరణ
జిల్లా వ్యాప్తంగా రెండు నెలల పాటు ఈ కార్యక్రమం ముమ్మరంగా చేపట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 60 వేల వరకు ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. జిల్లావ్యాప్తంగా 4.12 లక్షల మంది ప్రజలు, యువతీ, యువకులు సంతకాలు చేశారు. వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేటీకరణ చేస్తే పేద రోగుల నుంచి ముక్కు పిండి వేల, లక్షల రూపాయల్లో డబ్బులు వసూలు చేస్తారన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలతో అనుబంధంగా వచ్చే ఆసుపత్రుల్లో పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు ఉచితంగా అందుతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైద్య కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుందని తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబు సర్కార్ ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలన్న డిమాండ్ ప్రజల్లో నుంచి బలంగా వినిపించింది.
ప్రజల నుంచి సేకరించిన సంతకాల ప్రతులను బాక్సుల్లో ఉంచి సోమవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నాం. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించారు. కోటి సంతకాల ఉద్యమం తుది దశకు రావడంతో కర్నూలులో సోమవారం ర్యాలీ చేపడుతున్నాం. ప్రజలు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. పార్టీ నాయకులు , కార్యకర్తలు భారీగా పాల్గొనాలి.
– ఎస్వీ మోహన్ రెడ్డి,
వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు


