‘స్థానిక’ ఎన్నికలను బహిష్కరిస్తాం
ఆదోని రూరల్: చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పెద్దహరివాణం మండలం ఏర్పాటు నిర్ణయాన్ని 16 గ్రామాల ప్రజలు వ్యతిరేకించారు. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని ఆ గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. ఈ మేరకు శనివారం 16 గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు ఆదోని పట్టణంలోని రెడ్డి భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గోపాల్‌రెడ్డి, బసాపురం వెంకటేష్, గణేకల్ విరుపాక్షి, మదిరె సర్పంచ్ నారాయణ, బసాపురం రామస్వామి, చాగి రాము, గణేకల్ ఎంపీటీసీ ఉచ్చీరప్ప మాట్లాడుతూ.. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఐక్యమత్యంతో బహిష్కరిస్తామని తీర్మానం చేశారు. ఇప్పటికే 16 గ్రామాలను పెద్దహరివాణం మండలంలో చేర్చవద్దని జిల్లా కలెక్టర్‌కు, సబ్‌కలెక్టర్‌కు, తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు సమర్పించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు వారు తెలిపారు.


