పారిశుద్ధ్య కార్మికులకు 50 కష్టాలు | - | Sakshi
Sakshi News home page

పారిశుద్ధ్య కార్మికులకు 50 కష్టాలు

Dec 14 2025 8:46 AM | Updated on Dec 14 2025 8:46 AM

పారిశ

పారిశుద్ధ్య కార్మికులకు 50 కష్టాలు

కర్నూలు(హాస్పిటల్‌): ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఏ ఉద్యోగికై నా పదవీవిరమణ వయస్సు 60. కొంత మందికి వారి వారి అర్హత, స్థాయిలను బట్టి 62 నుంచి 63కు పెంచారు. కొందరు వైద్యులు, ఇతర అధికారులు ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఇతర సంస్థల్లో పనిచేస్తున్నారు. అలాంటిది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అవుట్‌సోర్సింగ్‌ విధానంలో పారిశుద్ధ్యకార్మికులుగా పనిచేసే వారికి మాత్రం ఉద్యోగ విరమణ వయస్సు 50గా నిర్ణయించారు. 50 దాటితే పనిలోకి రావద్దని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురిని ఉద్యోగంలో నుంచి తీసేశారు. మరికొందరిని తీసేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనిపై కార్మికుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 40 దాకా వివిధ విభాగాల్లో 1050 పడకలు ఉన్నాయి. రోగుల రద్దీ దృష్ట్యా అనధికారికంగా అదనంగా మరో 500 దాకా పడకలు ఏర్పాటు చేశారు. దీంతో కార్మికులను సైతం 1500 పడకలకు అనుగుణంగా తీసుకుంటున్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణకు కొన్ని నెలల క్రితం తిరుపతికి చెందిన పద్మావతి ఏజెన్సీ టెండర్‌ దక్కించుకుని నిర్వహిస్తోంది. ఈ మేరకు ఈ సంస్థకు ప్రభుత్వం రూ.84.10 లక్షలను ప్రతి నెలా చెల్లిస్తుంది. ఇందులో భాగంగా ఎంఓయూ ప్రకారం 399 మంది పారిశుధ్య కార్మికులు ఉండాలి. వార్డుల్లో ఉదయం 150 మంది, మధ్యాహ్నం 75 మంది, రాత్రి 56 మంది చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. మిగిలిన వారు వార్డుల బయట విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మరో 33 మంది రిజర్వులో ఉంటారు. వీరిని పర్యవేక్షించేందుకు 29 మంది సూపర్‌వైజర్లు పనిచేస్తున్నారు. ఈ మేరకు వారు కార్మికులతో పనిచేయిస్తారు. ఆసుపత్రితో పాటు మెడికల్‌ కాలేజీ, నర్సింగ్‌ స్కూల్‌, నర్సింగ్‌ కాలేజీ, ప్రభుత్వ కంటి ఆసుపత్రి, క్యాన్సర్‌ ఆసుపత్రుల్లోనూ ఈ సంస్థే పారిశుధ్య నిర్వహణ చేపడుతోంది.

20 ఏళ్లగా పని చేస్తున్నా..

ఆసుపత్రిలో పాతికేళ్ల క్రితం పారిశుధ్య నిర్వహణ పనులు ప్రభుత్వం నియమించిన ఉద్యోగులే నిర్వహించేవారు. పాతికేళ్ల క్రితం ఈ బాధ్యతలను అప్పటి టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. పదేళ్లకు పైగా ఆ సంఘాల సభ్యులే ఆసుపత్రిలో పారిశుధ్యపనులు నిర్వహించారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఇప్పటి వరకు మూడు, నాలుగు ఏజెన్సీలు పారిశుధ్య పనులు నిర్వహించాయి. ఇందులో భాగంగా కొందరు కార్మికులు 20 ఏళ్లుగా ఆసుపత్రిని నమ్ముకుని పనిచేస్తున్న వారూ ఉన్నారు. ప్రస్తుతం పారిశుధ్య నిర్వహణ పనులను దక్కించుకున్న పద్మావతి ఏజెన్సీ కొత్త నిబంధన తీసుకొచ్చింది. 50 ఏళ్లు దాటిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే పలువురిని రావద్దని కూడా చెప్పేశారు. ఈ విషయమై ఆ సంస్థ కార్యాలయం వద్ద ఇటీవల ఘర్షణ కూడా జరిగింది. తాజాగా మరికొందరిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. డిగ్రీ లేదని ఒక సూపర్‌వైజర్‌ను సైతం తొలగించినట్లు సమాచారం.

అధికారుల అండతో..

ఆసుపత్రిలో పద్మావతి ఏజెన్సీకి అధికారులు, ఉద్యోగుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు చర్చ కొనసాగుతోంది. వాస్తవంగా గతంలో పనిచేసిన సంస్థ 330 మంది కార్మికులతో పనిచేయించేది. ప్రస్తు తం టెండర్‌ దక్కించుకున్న సంస్థకు 399 మందిని కేటాయించారు. దీంతో తొలగించిన వారితో పాటు కొత్తగా 70 మందిని ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు చెప్పిన వారిని విధుల్లో తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భారీగా డబ్బులు చేతులు మారినట్లు చర్చ జరుగుతోంది. ఒక్కో పోస్టుకు రూ.1లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే వీరు తమ చేతిలో ఉన్నారని, తాము ఎవ్వరు చెప్పినా, ఎవ్వరికి చెప్పుకున్నా వినేది లేదని కార్మికులకు తెగేసి చెబుతుండటంతో ఏమి చేయాలో అర్థంగాని పరిస్థితి కార్మికుల్లో నెలకొంది. 50 ఏళ్ల తొలగింపు అంశం గురించి ఆసుపత్రి ఉన్నతాధికారులను కలిసి విన్నవించగా.. ‘అది సంస్థ నిర్ణయమని, తాము ఏమీ చేయలేమని’ తెగేసి చెప్పినట్లు తెలిసింది. ఇదే అంశంపై వైఎస్సార్‌ జిల్లా కడపలో పలువురు కార్మికులు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల అనంతపురంలో ఓ పారిశుధ్ధ్య కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కర్నూలు జీజీహెచ్‌లోనూ ప్రజాసంఘాలతో కలిసి పారిశుధ్యకార్మికులు ఆందోళనకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో

కొత్త రూల్‌

యాభై ఏళ్లు దాటితే ఇంటికే..!

కొత్తగా ఏజెన్సీ దక్కించుకున్న

యాజమాన్యం చర్యలు

నోరు మెదపని అధికారులు

ఆందోళనకు సిద్ధమైన కార్మికులు

పారిశుద్ధ్య కార్మికులకు 50 కష్టాలు1
1/1

పారిశుద్ధ్య కార్మికులకు 50 కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement