రైతు ఆత్మహత్య
వెల్దుర్తి: వెల్దుర్తి మండలంలోని చెరుకులపాడు గ్రామానికి చెందిన రైతు జయరాముడు (52) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. జయరాయుడు తన ఇంట్లో ఉరివేసుకుని ఉండగా బయటకెళ్లిన చిన్న కుమారుడు యుగంధర్ మధ్యాహ్న సమయంలో వచ్చి చూసి ఆందోళన చెందాడు. ఈ సమయంలో భార్య కృష్ణవేణి, పెద్ద కుమారుడు బలరాముడు, కుటుంబ సభ్యులు గ్రామ సమీపంలోని తమ పొలంలో సాగు చేసిన పంట పొగాకు ఆకులు కోసి కుట్టే పనిలో నిమగ్నమై ఉండగా సమాచారం అందించాడు. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఉరికొయ్యకు వేళాడుతూ మరణించిన జయరాముడుని చూసి విలపించారు.
గొర్రెల మందపైకి
దూసుకెళ్లిన లారీ
కోడుమూరు రూరల్: కోడుమూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డులో విశ్వభారతి హాస్పిటల్ సమీపాన రోడ్డుపై వెళుతున్న గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లింది. శనివారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనలో 35 గొర్రెలు మృతి చెందాయి. వివరాలిలా ఉన్నాయి. తెలంగాణలోని కొల్లాపుర్‌కు చెందిన గొర్రెల కాపరులు గొల్ల చిన్న రాముడు, గొల్ల పెద్దరాముడు, శివ అనే వ్యక్తులు తమ గొర్రెలను పెంచికలపాడు గ్రామం వద్ద ఉన్న పొలాల్లో గత కొద్ది రోజుల నుంచి మేపు కోసం ఆపుకుంటున్నారు. అయితే, శనివారం సాయంత్రం గొర్రెల మందను పొలాల్లో ఆపుకునేందుకు రోడ్డుపై తీసుకెళుతుండగా, కోడుమూరు వైపు నుంచి కర్నూలుకు వెళుతున్న లారీ వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో సుమారు 35 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందగా పలు గొర్రెలు గాయపడ్డాయి. ఈ ప్రమాదంతో సుమారు రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు గొర్రెల కాపరులు తెలిపారు. కె.నాగలాపురం ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గొర్రెల కాపరిపై
ఎలుగుబంటి దాడి
చాగలమర్రి: అహోబిలం పుణ్యక్షేతం పరిధిలోని అటవీ ప్రాంతంలో శనివారం గొర్రెల కాపరిపై ఎలుగుబంటి దాడి చేసింది. ఎగువ అహోబిలం సమీపంలోని చెరువు వద్ద చాకలిబండ సమీపంలో మేకలను మేపుతున్న గొర్రెల కాపరి ఎరుకలి శ్రీరాములుపై ఎలుగుబంటి దాడి చేసింది. తీవ్రగాయాలైన అతడిని స్థానికులు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అహోబిలం అడవుల్లోకి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు.
కిక్కు దిగేలా
మద్యం బాబులకు జరిమానా
కర్నూలు: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ తనిఖీల్లో పోలీసులకు పట్టుబడిన మద్యం బాబులకు కిక్కు దిగేలా న్యాయమూర్తి తీర్పు చెప్పారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ మన్సూరుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలో ప్రతిరోజూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పట్టుబడిన 93 మందిని శనివారం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.9.30 లక్షలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ట్రాఫిక్ సీఐ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ప్రతిరోజూ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై మద్యం తాగి పట్టుబడిన వారిపై నెల రోజుల పాటు జైలు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సీఐ తెలిపారు.
రైతు ఆత్మహత్య
రైతు ఆత్మహత్య


