వైభవంగా గంధం వేడుకలు
కౌతాళం: మండల కేంద్రమైన కౌతాళం నుంచి శనివారం గంధంను వైభవంగా కర్ణాటక రాష్ట్రం కురుగోడుకు తీసుకుని వెళ్లారు. కౌతాళంలో వెలసిన జగద్గురు ఖాదర్‌లింగస్వామి దర్గాకు 10వ ధర్మకర్తగా, ముతవల్లిగా 41సంవత్సరాలు సేవలు అందించి 2022 జనవరి26న మృతి చెందిన సయ్యద్ సాహెబ్‌పీర్ వుసేని చిష్తీ నాల్గవ ఉరుసు ఆదివారం (నేడు) కర్ణాటక రాష్ట్రం కురుగోడులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం ఖాదర్‌లింగస్వామి దర్గాలో ప్రత్యేక ఫాతెహాల అనంతరం గంధంను గ్రామ పూర వీధుల గుండా ఊరేగింపు నిర్వహించి డప్పు వాయిద్యాల మధ్య బ్యాండు మేళాలతో తరలించారు. వివిధ దర్గాల పీఠాధిపతులు పాల్గొన్నారు.
క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం కర్నూలులో నగరంలోని బి.క్యాంపు మైదానంలో నిర్వహించారు. నాలుగు కిలోమీటర్లు, 8 కిలోమీటర్ల పరుగును నిర్వహించారు. కార్యక్రమానికి విక్టర్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాజీ కార్యదర్శి డాక్టర్ హర్షవర్దన్, ఒలంపిక్ సంఘం కార్యదర్శి రామాంజనేయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లు ఎక్కువగా నిర్వహించాలని చెప్పారు. చదువుతో పాటు క్రీడల్లో పాల్గొంటే రాష్ట్ర, దేశస్థాయిల్లో రాణించవచ్చన్నారు. అనంతరం క్రీడాకారుడు వెంకటరామిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు జాఫర్ మున్న, ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్ష్మయ్య, కోచ్ కాశీరావు, నసీరుల్లాబేగ్, బిల్లా శ్రీను, మల్లేష్, మల్లి పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో నిర్వహించే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీలకు కర్నూలు జిల్లా క్రీడాకారులు పాల్గొంటారని ఇన్‌చార్జ్ కార్యదర్శి లక్ష్మయ్య, సహాయ కార్యదర్శి బిల్లా శ్రీను, అథ్లెటిక్ కోచ్ కాశీరావు తెలిపారు.
పోస్టాఫీస్‌లో చోరీ
పత్తికొండ: పోస్టాఫీసు సిబ్బందితో మాటలు కలిపి చోరీకి పాల్పడిన ఘటన శనివారం పత్తికొండలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఉదయం ఇద్దరు దొంగలు పట్టణంలోని పోస్టాఫీసుకు వచ్చారు. క్యాషియర్ దగ్గరకు వెళ్లి తమిళంలో మాట్లాడుతూ ఓ పేపరు చూపించి అడ్రస్ అడిగారు. సిబ్బంది ఆ పేపర్ చూస్తుండగా క్యాస్ బాక్స్‌లోని రూ. 60వేలు నగదు చోరీ చేసుకొని వెళ్లిపోయారు. కాసేపటికే గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ జయన్న తెలిపారు.
చలి కాచుకుంటుండగా..
కొలిమిగుండ్ల: స్థానిక కస్తూర్బా పాఠశాల ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో నివాసం ఉంటున్న శిరీష అనే మహిళ శనివారం తెల్లవారు జామున చలి మంట వేసుకొని చలి కాచుకునే సమయంలో గాయాలయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో కాలనీలోని మహిళలు చలి మంట వేసుకున్నారు. ప్రమాదవశాత్తు శిరీష చీరకు నిప్పు అంటుకోవడంతో గాయాలయ్యాయి. పక్కనే మహిళలు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. గాయపడిన ఆమెను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అక్కడి నుంచి కర్నూలుకు తీసుకెళ్లారు.
వైభవంగా గంధం వేడుకలు


