ప్రభుత్వాలే బుడగ జంగాలు కులానికి అన్యాయం చేస్తున్నాయి
● రిటైర్డ్ జడ్జి జస్టిస్ కె.చంద్రు వ్యాఖ్య
కర్నూలు(సెంట్రల్) : భిక్షాటన చేస్తూ జీవనం సాగించే బుడగ జంగాలులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరని అన్యాయం చేస్తున్నాయని మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి కె. చంద్రు అభిప్రాయపడ్డారు. శనివారం కర్నూలు వచ్చిన ఆయనను బుడగ, బేడ సంక్షేమ సంఘం నాయకులు కలసి వారికి రిజర్వేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. అందుకు ఆయన స్పందించి ఏపీ ప్రభుత్వం బుడగ జంగాలుల రాజ్యాంగ పరమైన హక్కులన కాలరాస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసే బుడగ జంగాలుల కు ఏ రిజర్వేషన్ లేకుండా చేశాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. కుల సర్టిఫికెట్ లేని కారణంగా బుడగ జంగాలుల విద్య, ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారన్నారు. సంక్షేమ పథకాలకు అర్హత సాధించలేకపోతున్నారని, తక్షణమే వారికి కుల సర్టిఫికెట్‌ను ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో తూర్పాటి మనోహర్, నరసింహులు, నాగలక్ష్మీ, విజయభారతి, కుమార్ పాల్గొన్నారు.


