ఆదోని జిల్లా చేయాలి
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు: ప్రజల ఆకాంక్షను గౌరవించి ఆదోని జిల్లా చేయాలని ఎమ్మెల్యే విరూపాక్షి డిమాండ్ చేశారు. ఆలూరులో శుక్రవారం జేఏసీ నాయకులు రఘరామయ్య, ఆశోక్‌నందారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరహారదీక్షల శిబిరాన్ని ప్రారంభించారు. వీరికి మద్దతు ప్రకటించిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఆదోని జిల్లా ఏర్పాటుపై సమగ్రంగా నివేదికను అందజేయాలని సీఎం చంద్రబాబు కోరినా టీడీపీ నాయకులు తమ ఉనికి కోల్పోతామని అడ్డుకుంటున్నారన్నారు. జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకు ఆదోని జిల్లా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు గిరి, పార్టీ నాయకులు శ్రీనివాసులు, రాజు, మల్లికార్జున, వరుణ్, రాజు, వెంకటేశ్వర్లు ఉన్నారు. అంతకు ముందు స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలను వేసి నివాళులర్పించారు.
కర్నూలు (అర్బన్): ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉమీద్ వక్ఫ్ పోర్టల్‌లో వివరాల అప్‌లోడ్‌నకు గడువును మరో ఆరు నెలలు పొడిగించినట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యనిర్వాహక అధికారి షేక్ మొహమ్మద్ అలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థలు, వాటికి చెందిన అనుబంధ ఆస్తుల వివరాలను ఉమీద్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే ప్రక్రియను జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభించామని చెప్పారు. చివరి తేదీగా ఈ ఏడాది డిసెంబర్ 5గా నిర్ణయించబడిందని తెలిపారు. అయితే సాంకేతిక సమస్యలు, కొంత వక్ఫ్ ఆస్తుల రికార్డులు తెలంగాణ వక్ఫ్ బోర్డు నుంచి వివిధ కారణాలతో అందకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వక్ఫ్ బోర్డు వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యునల్ పరిశీలించిన సమస్యలను పరిగణలోకి తీసుకుని గడువు పొడిగింపు ఆదేశాలు జారీ చేసిందని ఆయన తెలిపారు. దీంతో ఉమీద్ పోర్టల్‌లో వక్ఫ్ సంస్థల వివరాలను అప్‌లోడ్ చేసుకునే గడువు జూన్ 6వ తేదీ వరకు పొడిగించబడిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని రాష్ట్రంలోని అన్ని వక్ఫ్ సంస్థల మేనేజింగ్ కమిటీలు, ముతవల్లీలు, సంబంధిత బాధ్యులు తమ సంస్థలకు సంబంధించిన పూర్తి వివరాలను సమయానికి ఉమీద్ పోర్టల్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలని ఆయన కోరారు.


