చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత
● ప్రభుత్వ వైద్య కళాశాలల
ప్రైవేటీకరణను విరమించుకోవాలి
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
కర్నూలు (టౌన్): చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులోని పార్టీ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గస్థాయిలో సేకరించిన కోటి సంతకాల సేకరణ పత్రాలను శుక్రవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్వీ మాట్లాడుతూ.. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను విరమించుకోకుంటే సుప్రీం కోర్టులో పిల్ వేస్తామన్నారు. ప్రజల అభిప్రాయం మేరకు సేకరించిన కోటి సంతకాల పత్రాలను గవర్నర్‌కు ఈనెల 18న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందిస్తారన్నారు. అప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకుంటే ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ప్రజాకాంక్షను గౌరవించాలి
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఒకేసారి 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చాయన్నారు. వీటిని నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం రూ. 8,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య సీట్లు వద్దంటూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాసిందన్నారు. పీపీపీ విధానంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోందన్నారు. ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ దశల వారీగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించిందన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఇంటింటికి తిరిగి నాలుగు లక్షలకు పైగా ప్రజల నుంచి సంతకాలు సేకరించామన్నారు. కర్నూలు నియోజకవర్గంలో 67 వేల మంది సంతకాలు చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు అహమ్మద్ ఆలీఖాన్, కార్పొరేటర్ క్రిష్ణ కాంత్ రెడ్డి, పార్టీ నేతలు షరీఫ్, శ్రీనివాసరెడ్డి, నరసింహులు యాదవ్, రాఘవేంద్ర నాయుడు, కిషన్, లాజరస్, నవీన్, ఫిరోజ్, పత్తాబాషా, కంటూ, కటికె గౌతమ్ పాల్గొన్నారు.


