వ్యక్తి దారుణ హత్య
● పాత కక్షలతో దారుణం
● కొడవలితో మెడపై నరికిన నిందితుడు
గుంతకల్లు/చిప్పగిరి: పాత కక్షలు మనసులో పెట్టుకున్న ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కొడవలితో దారుణంగా ఓ వ్యక్తిని నరికి చంపిన ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో చోటు చేసుకుంది. హతుని భార్య పుష్పవతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపంలో కురబ చంద్రశేఖర్(30), పుష్పవతి దంపతులు నివాసం ఉంటున్నారు. చంద్రశేఖర్ టైలర్ వృత్తితో పాటు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతని సొంతూరు కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నంచర్ల. రెండేళ్ల నుంచి పాత గుంతకల్లులోని అంకాళమ్మ గుడి సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. వారి ఇంటి పక్కనే కురబ బండయ్య, నాగవేణి దంపతులతో పాటు వారి కుమారుడు శివకుమార్ ఉంటున్నారు. ఏడాది క్రితం చంద్రశేఖర్ మిరపకాయల లోడ్ చేయడానికి కూలి పని నిమిత్తం వేరే ఊరికి వెళ్లాడు. భార్య పుష్పవతి ఒక్కరే ఇంట్లో ఉండగా..ఇది అదనుగా తీసుకున్న శివకుమార్ అర్ధరాత్రి ఇంటి తలుపులు కొట్టాడు. ఈ విధంగా రెండు, మూడు సార్లు చేయడంతో ఆమె విషయాన్ని భర్త చంద్రశేఖర్‌కు తెలిపింది. దీంతో చంద్రశేఖర్, శివకుమార్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అప్పటి నుంచి శివకుమార్ కక్ష పెంచుకున్నాడు. ప్రతి చిన్న విషయానికీ గొడవకు దిగేవాడు. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఇంటి సమీపంలోని కుళాయి వద్ద నీళ్లు పట్టుకోవడానికి చంద్రశేఖర్, శివకుమార్ వెళ్లారు. తాను ముందుగా వచ్చానని, నీళ్లు పట్టుకుంటానని చంద్రశేఖర్ అనడంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన శివకుమార్ ఘర్షణ పడ్డాడు. వెంటనే పక్కనే ఉన్న ఇంట్లోకి వెళ్లి కొడవలి తీసుకొచ్చి నీళ్లు పట్టుతున్న చంద్రశేఖర్ మెడపై మూడు సార్లు నరికాడు. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంట్లో నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన పుష్పవతి రక్తపు మడుగులో పడి ఉన్న భర్తను చూసి బోరున విలపించింది. సీఐలు మనోహర్, ప్రవీణ్‌కుమార్, ఎస్‌ఐ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పుష్పవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు కురబ శివకుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది.


