రౌడీలపై పిడికిలి | - | Sakshi
Sakshi News home page

రౌడీలపై పిడికిలి

Dec 12 2025 6:43 AM | Updated on Dec 12 2025 6:43 AM

రౌడీల

రౌడీలపై పిడికిలి

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దండన తప్పదు

కర్నూలు: అసాంఘిక శక్తులు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నేరాలు అధికంగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో స్టేషన్‌ పరిధిలోని శరీన్‌ నగర్‌లో నివాసముండే కిరాయి హంతకులు (షీట్‌ నెం.1) వడ్డె రామాంజినేయులు అలియాస్‌ వడ్డె అంజి, సస్పెక్ట్‌ షీటర్‌ (నెం.216) పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌లపై కలెక్టర్‌ జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అలవాటు పడిన వీరిద్దరిపై ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రతిపాదనల మేరకు క్రిమినల్‌ రికార్డులను పరిశీలించి జిల్లా బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేశారు. వడ్డె రామాంజినేయులుపై 17కు పైగా క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. హత్యలు, దోపిడీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల మీద దాడులు, హత్యాయత్నం కేసులు, జులుం.. ఇలా పలు కేసులు ఉన్నాయి. అలాగే పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా 19 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. పలుమార్లు వీరు జైలుకు వెళ్లినప్పటికీ ఎలాంటి మార్పు కనిపించలేదు. దీంతో 2022లో వీరిద్దరినీ పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి కడప సెంట్రల్‌ జైలుకు పంపించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా పరివర్తన చెందకపోగా పదేపదే నేరాల్లో పాల్గొంటున్నందున వీరిద్దరినీ జిల్లా బహిష్కరణకు గురిచేశారు. ఇకపై వారు జిల్లా పరిధిలో కనిపించకూడదు. ఒకవేళ కనిపించినా అరెస్టు చేసి జైలుకు పంపించే అధికారం పోలీసులకు ఉంటుంది.

గతంలో కూడా నలుగురిపై పీడీ యాక్ట్‌...

గతంలో కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నలుగురిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి పోలీసులు కడప సెంట్రల్‌ జైలుకు పంపారు. కర్నూలు మాజీ ఎంపీపీ భర్త రామకృష్ణ యాదవ్‌, నకిలీ విత్తన వ్యాపారి మునిగొండ రత్నాకర్‌ రావు, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి చెందిన గూడూరు సంజీవరాయుడు, పెద్దిరెడ్డి కొండారెడ్డి, నాసారి వెంకటేశ్వర్ల పూర్వపు నేర చరిత్రను పరిశీలించి, పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపారు.

మరికొందరిపై వేటుకు ప్రతిపాదనలు...

జిల్లాలో నాలుగు పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. వాటి పరిధిలో సుమారుగా 1,500 మందికి పైగా రౌడీషీటర్లు ఉన్నారు. ఒక్క కర్నూలు సబ్‌ డివిజన్‌ పరిధిలోనే అత్యధికంగా 460 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో కర్నూలు నగరంలోనే 220 మంది ఉన్నారు. ఈ ఏడాది మార్చిలో శరీన్‌ నగర్‌కు చెందిన సంజన్నను అదే కాలనీలో నివాసముండే కిరాయి హంతకుడు వడ్డె అంజి, అతని కుమారులు కలసి హత్యకు పాల్పడిన నేపథ్యంలో పోలీసు అధికారులు కిరాయి హంతకులు, రౌడీ షీట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. మరో ఐదుగురిపై పీడీ యాక్ట్‌ నమోదుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి జిల్లా బహిష్కరణ హెచ్చరిక లాంటిది. రౌడీల కార్యకలాపాలు, వారిపై ఉన్న కేసుల తీవ్రతను బట్టి బహిష్కరణ నిర్ణయం తీసుకుంటున్నాం. దీని ద్వారా మార్పు రాకపోతే పీడీ చట్టాన్ని కూడా ప్రయోగిస్తాం. స్టేషన్ల వారీగా రౌడీషీటర్లపై చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే నగర, జిల్లా బహిష్కరణలు, పీడీ యాక్టుల నమోదు. ఈ ప్రక్రియ నిర్విరామంగా ఉంటుంది. – ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

వడ్డె రామాంజినేయులు, కిరాయి హంతకుడు (ఫైల్‌)

పఠాన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌, సస్పెక్ట్‌ షీటర్‌ (ఫైల్‌)

సంవత్సరం పాటు నిర్బంధం...

రెండు సంవత్సరాల వ్యవధిలో ఐదు కంటే ఎక్కువ నేరాల్లో పాల్గొంటే అతనిపై పీడీ చట్టం నమోదు చేసే అవకాశం ఉంది. సాధారణంగా మూడు కంటే అధికంగా నేరాలకు పాల్పడేవారిపై ఆటోమేటిక్‌గా అతనిపై షీటు తెరుస్తారు. ఐదు నేరాల కంటే అధికంగా చేస్తే కలెక్టర్‌ ఆదేశాలతో పీడీ చట్టం ప్రయోగిస్తారు. ఒకసారి ఈ చట్టం ప్రయోగిస్తే సంవత్సర కాలం పాటు అతనిని నిర్బంధిస్తారు. బాహ్య ప్రపంచానికి సంబంధం ఉండదు. కడప సెంట్రల్‌ జైలుకు తరలిస్తారు. ఎవరినీ కలిసేందుకు అనుమతి ఉండదు. బెయిల్‌ కావాలంటే హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఎవరైనా ములాఖత్‌ కావాలంటే అనుమతి జైలర్‌కు ఉండదు. ప్రభుత్వ హోం ప్రిన్సిపాల్‌ సెక్రటరీ అనుమతి ఉండాల్సిందే. ఏడాది తర్వాత సత్ప్రవర్తన బాగోలేదని పోలీసు శాఖ నివేదిస్తే మరో సంవత్సరం పాటు నిర్బంధంలో ఉండాల్సిందే. రౌడీషీటర్లపై తీసుకునే అత్యంత కఠినమైన శిక్ష పీడీ యాక్ట్‌.

ఇద్దరు రౌడీషీటర్లపై

జిల్లా బహిష్కరణ వేటు

కలెక్టర్‌ ఉత్తర్వులతో

కడప సెంట్రల్‌ జైలుకు

ఏడాది పాటు జైలులోనే నిర్బంధం

మరికొందరిపై వేటుకు ప్రతిపాదనలు

రౌడీలపై పిడికిలి1
1/3

రౌడీలపై పిడికిలి

రౌడీలపై పిడికిలి2
2/3

రౌడీలపై పిడికిలి

రౌడీలపై పిడికిలి3
3/3

రౌడీలపై పిడికిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement