మల్లన్న సేవలో అఖండ–2 మూవీ టీం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను గురువారం అఖండ–2 చిత్ర యూనిట్ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. మల్లన్న దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు అశ్విన్‌బాబు, ఆది సాయికుమార్, ఇతర నటినటులకు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వీరు మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో అఖండ చిత్ర యూనిట్ సభ్యులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల డైరెక్టర్ బోయపాటి మాట్లాడుతూ అఖండ–2 సినిమాకు అన్ని విఘ్నాలు తొలగిపోవడంతో శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నామన్నారు. తప్పకుండా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారన్నారు.


