ప్రభుత్వ భూముల కబ్జా!
మాన్యువల్‌గా పట్టాలు పొందిన టీడీపీ నాయకులు
బండలు పాతి కోట్ల విలువైన భూముల ఆక్రమణ
పునాదులు తీసిన వైనం
పట్టించుకోని రెవెన్యూ అధికారులు
పత్తికొండ రూరల్: ప్రభుత్వ భూములపై టీడీపీ నాయకులు గద్దల్లా వాలిపోతున్నాయి. రూ. కోట్ల విలువైన భూముల్లో పాగా వేస్తున్నారు. పత్తికొండ మండలం మండగిరి గ్రామపంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 616–2లో 90 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. ఈ భూమిని గతంలో ప్రభుత్వ భవన నిర్మాణాలకు కేటాయించారు. అయితే ప్రభుత్వ భవన నిర్మాణాలకు కేటాయింపు జరగకుండా వాయిదా పడుతూ వచ్చింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు పత్తికొండ–చిన్నహుల్తి రోడ్డులో ప్రధాన రోడ్డుపక్కనే ఉన్న ఈ భూమిని ఆక్రమించారు. కొన్ని రోజుల నుంచి పునాది తవ్వకాలు చేపట్టి, బండలు పాతే పనులు సాగిస్తున్నారు. 306–3, 306–4 ప్రభుత్వ భూముల్లో ఎవరికి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదు. కానీ గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దారుతో మాన్యువల్‌గా పట్టాలు పొందిన వారు స్థలం చదును పనులు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా రెవెన్యూ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
దర్జాగా పునాది తవ్వకాలు
కోట్ల విలువైన భూముల కబ్జాకు రెవెన్యూ అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తున్నట్లు తెలుస్తోంది. వారి సహకారంతోనే స్థలం కొలతలు వేసి మరీ రాళ్లు పాతేశారు. అంతటితో ఆగకుండా ప్రైవేటు వెంచర్‌లా మార్చి దర్జాగా రాళ్లకు రంగులేసి ప్రభుత్వ భూముల్లో పాగా వేశారు. అక్రమంగా బండలు నాటి స్థలం హద్దులు ఏర్పరచుకున్నారు. పట్టపగలే ఆక్రమిత ప్రదేశాల్లో పనులు జరుగుతున్నా అధికారుల్లో చలనం మాత్రం కరువైంది. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి కోట్ల విలువైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వ భూముల కబ్జా!


