చోరీ కేసుల్లో ముగ్గురు అరెస్ట్
మహానంది: ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని రైతుల పొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్ల వద్ద ఏర్పాటు చేసిన అల్యూమినియం తీగల చోరీ ఘటనలో మహానంది మండలానికి చెందిన ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా పోలీసులు రైతుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టడంతో చోరీకి పాల్పడిన వారిని గుర్తించారు. మార్కాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అల్యూమినియం తీగల చోరీ ఘటనలో గిద్దలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడు, పెద్దారవీడు, కంభం పోలీస్‌స్టేషన్ల పరిధిలో మరో నాలుగు కలిసి మొత్తం ఏడు కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. గత మూడు నెలల నుంచి చోరీలు జరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో మహానంది మండలం గాజులపల్లె సమీపంలోని ఆంజనేయకొట్టాల గ్రామానికి చెందిన ఆంజనేయులు, శ్రీనివాసులు, దావీదులను అరెస్ట్ చేశామన్నారు. వీరు గతంలో వెదుర్లు సేకరించి జీవనోపాధి పొందేవారని, చిన్న చిన్న చోరీలకు అలవాటు పడ్డారని మార్కాపురం పోలీసులు చెప్పారు. వారి నుంచి ఓ ఆటోను సీజ్ చేయడంతో పాటు రూ. 3.85లక్షల విలువైన 15,100 మీటర్ల పొడవున్న 11కేవీ అల్యూమినియం కరెంటు వైరు, 45 కిలోల బరువున్న కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల మహానంది, శిరివెళ్ల మండలాల పరిధిలోనూ మోటార్ వైర్ల చోరీలు తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఉరివేసుకొని లారీ డ్రైవర్ మృతి
బేతంచెర్ల: హెచ్ కొట్టాల గ్రామంలో లారీ డ్రైవర్ చల్లా తిరుమలేష్ (31) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చల్లా తిరుమలేష్ భార్య మంజుల కాన్పు కోసం పుట్టినిల్లు బేతంచెర్లకు వెళ్లింది. తల్లి కృష్ణవేణమ్మ రెండేళ్ల క్రితం, అన్న గంగాధర్ మూడేళ్ల క్రితం మృతి చెందడంతో మన స్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న తిరుమలేష్ మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బేతంచెర్ల సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య మంజులతో పాటు ఒక కుమార్తె, కొడుకు ఉన్నారు. మృతుడి తండ్రి వెంకట్రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు శెట్టి బుధవారం తెలిపారు.


