జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్
కర్నూలు : ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా అంతటా విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు స్టేషన్ల వారీగా పోలీసులు అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలతో పాటు రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు విధిగా సీటు బెల్టు ధరించాలని అవగాహన కల్పించారు. మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ తదితర వాటిపై దృష్టి సారించి తనిఖీల్లో భాగంగా వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని తిప్పుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే స్థానిక పోలీసులకు కాని, డయల్ 112, 100కు కాని సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు.


