టీడీపీకి ఎదురు దెబ్బ
● పార్టీని వీడిన సీనియర్ నాయకులు ● వైఎస్సార్‌సీపీలోకి చేరిన 150 కుంటుబాలు
సి.బెళగల్: అధికార టీడీపీ పార్టీకి సి.బెళగల్ మండలంలో గట్టి ఎదురు దెబ్బ తలిగింది. మంగళవారం మండల పరిధిలోని కంబదహల్ గ్రామానికి చెందిన దాదాపు 150 కుటుంబాల సభ్యులు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. వారిని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్‌లు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాము ఏళ్ల తరబడి టీడీపీని నమ్ముకుని ఉన్నామని, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఏమీ జరగడం లేదని, అధికార పార్టీలో ఉండలేక వైఎస్సార్‌సీపీలో చేరామని గ్రామానికి చెందిన బోయ లోటి సోమన్న, కొత్తపల్లి వీరేష్, చాకలి మద్దిలేటి, నాగేష్, చాకలి రాజు, దేవసహాయం తదితరులు తెలిపారు.
అండగా ఉంటాం..
ప్రజలకు, వైఎస్సార్‌సీపీలో నాయకులకు, కార్యకర్తలకు, తాము అండగా ఉంటామని కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు. ప్రజా వ్యతిరేక పాలనను మాకు వద్దు అని ప్రజలు బహిరంగా అనే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సోమశేఖర్‌రెడ్డి, నాయకులు కరుణాకర్‌రెడ్డి, రామాంజనేయులు, సోమశేఖర్, రాజు, దేవరాజు, ఏలియా, సాంసూన్, ఏసేపు తదితరులు పాల్గొన్నారు.


