చిన్నారి గొంతులో ఇరుక్కున్న నాణెం
● విజయవంతంగా తొలగించిన వైద్యులు
కర్నూలు(హాస్పిటల్): ప్రమాదవశాత్తూ చిన్నారి గొంతులో ఇరుక్కున్న రూ.2ల నాణేన్ని కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్ వైద్యులు ఎండోస్కోపి పరికరం ద్వారా విజయవంతంగా తొలగించారు. మంగళవారం వివరాలను ఆసుపత్రి క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...‘ పత్తికొండ మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన చిన్నారి లాస్య(7) రెండు రోజుల క్రితం రూ.2ల నాణేన్ని నోట్లో పెట్టుకుని స్కూల్‌లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ గొంతులో దిగిపోయి అన్నవాహికలో ఇరుక్కుపోయింది. వెంటనే తల్లిదండ్రులు పాపను కర్నూలులోని మెడికవర్ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. పాపను సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ అబ్దుల్ సమద్ ఎక్స్‌రే తీసి చూడగా అది గొంతులో ఇరుక్కున్నట్లు గుర్తించారు. వెంటనే ఎండోస్కోపిక్ సాయంతో శస్త్రచికిత్స అవసరం లేకుండా నాణేన్ని తొలగించారు. అనంతరం చిన్నారికి నియోనెటాలజిస్టు డాక్టర్ వై.గణేష్ తగిన చికిత్స అందించి త్వరగా కోలుకునేలా చేశారు’ అని వివరించారు. పాప కోలుకోవడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామన్నారు.


