ట్రాఫిక్ చలానా పెండింగ్ కేసులపై దృష్టి సారించండి
కర్నూలు: ట్రాఫిక్ ఉల్లంఘన కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టి పెండింగ్ చలానాలను సెటిల్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సూచించారు. పోక్సో కోర్టు అదనపు జిల్లా జడ్జి రాజేంద్రప్రసాద్‌తో కలసి మంగళవారం స్థానిక మున్సిఫ్ కోర్టు హాల్‌లో జ్యుడీషియల్, పోలీసు అధికారులతో జాతీయ లోక్ అదాలత్‌పై సమీక్షించారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారు పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలను ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. పోలీసులందరూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానా కేసులను లోక్ అదాలత్‌లో సెటిల్ చేసుకోవాల్సిందిగా కోరారు. వాహన వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ట్రాఫిక్ చలానా కేసులను పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. జూనియర్ సివిల్ జడ్జిలు అనిల్ కుమార్, అనూష, అపర్ణ, కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, సీఐలు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.


