● అంతర్‌జిల్లా బైకుల దొంగ అరెస్టు ● సీసీ ఫుటేజీ ద్వారా
కన్నేసి.. బైకులు కాజేసి!
కర్నూలు: అతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. అతనితో పాటు చదువుకున్న వారంతా ఉద్యోగాలు, వ్యాపారాల్లో స్థిరపడ్డారు. అయితే అతను అడ్డదారులు తొక్కుతూ బైకుల దొంగగా మారి జైలు పాలయ్యాడు. అనంతపురం జిల్లా రుద్రంపేట గ్రామం (కక్కలపల్లె) చంద్రబాబు నగర్‌లో నివాసముంటున్న పోతుల జాన్ కర్నూలులోని వివిధ ప్రాంతాల్లో బైకులు చోరీ చేసి పక్కా ఆధారాలతో మూడో పట్టణ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. చదువు మధ్యలో ఆగిపోయి జీవనోపాధి కోసం కొత్తగా నిర్మాణమైన ఇళ్లల్లో ఇంటీరియర్ వర్క్ చేస్తూ జీవనం సాగించేవాడు. దానిపై వచ్చే ఆదాయం సరిపోక సులువుగా డబ్బు సంపాదించే మార్గాన్ని అన్వేషించాడు. ద్విచక్ర వాహనాల చోరీని ఎంచుకున్నాడు. కర్నూలు నగరంలో ప్రభుత్వాసుపత్రి, గాయత్రి ఎస్టేట్, జగదీష్ మాల్, సి.క్యాంప్ రైతుబజార్ తదితర రద్దీ ప్రాంతాల్లో భారీగా ద్విచక్ర వాహనాలు చోరీ చేశాడు. ఏడాదిన్నర కాలంగా సాగుతున్న అతని చోరీల పర్వానికి మూడు పట్టణ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా ఆధారాలతో నిఘా పెట్టి అతని నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 42 ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. మూడో పట్టణ సీఐ శేషయ్య, ఎస్‌ఐ ఆశాలతతో కలసి కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ స్థానిక స్టేషన్‌లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
వెలుగు చూసిందిలా...
ప్రభుత్వాసుపత్రిలో ద్విచక్ర వాహన చోరీలు అధికమయ్యాయని పోలీసుల దృష్టికి వచ్చింది. ఇదే క్రమంలో నవంబర్ 29వ తేదీన కుమ్మరి కృష్ణవేణి అనే మహిళ తన మనవడితో ప్రభుత్వాసుపత్రిలోని గైనిక్ వార్డు వద్దకు వచ్చి మోటర్ సైకిల్ పార్కుచేసి లోపలికి వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. ఈ మేరకు ఆమె మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు నిఘా పెంచారు. చోరీ జరిగిన ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను సేకరించి దొంగ కోసం గాలిస్తుండగా ఇదే సమయంలో ఓ ఫిర్యాదుదారుని సెల్‌ఫోన్‌కు అనంతపురం జిల్లాలో ట్రాఫిక్ ఉల్లంఘనల మెసేజ్ వచ్చింది. దాని ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని అరుంధతి నగర్‌లో గల టైల్స్ ఫ్యాక్టరీ వెనుక ఉన్న కంప చెట్లలో నిందితుడు ఉన్నట్లు గుర్తించి వలపన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అతని నేరాల చిట్టా బయటపడింది. అతని వద్ద నుంచి రూ.35 లక్షలు విలువ చేసే 42 మోటర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. చోరీ చేసిన బైకులను గుర్తు పట్టకుండా ఉండేందుకు గాను నంబర్ ప్లేట్లు, ఇంజన్ నంబర్లు మార్చి తక్కువ ధరలకే విక్రయించినట్లు విచారణలో బయటపడింది. అనంతపురం రూరల్ గ్రామాల్లో కొన్నింటిని రూ.20 నుంచి రూ.25 వేల వరకు తాకట్టు కూడా పెట్టినట్లు గుర్తించారు. డోన్, గుత్తి ప్రాంతాల్లో కూడా ఇతను బైకులు చోరీ చేసినట్లు విచారణలో అంగీకరించాడు. తెలంగాణ రాష్ట్రం వరంగల్‌కు చెందిన శంకర్ కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్య విద్య పీజీ చదువుతున్నాడు. అతని బైకును కూడా చోరీ చేసినట్లు విచారణలో బయటపడింది.
రద్దీ ప్రాంతాలను ఎంచుకుని
రద్దీ ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తాడు. వాహనాలు ఆపి ఆసుపత్రులు, వ్యాపార సముదాయాల్లోకి ఎవరైనా వెళ్లగానే పని కానిచ్చేస్తాడు. అప్పటికే సిద్ధంగా ఉన్న మారుతాళంతో చోరీ చేస్తాడు. ఎంచక్కా వాహనంపైనే డోన్ మీదుగా స్వగ్రామం రుద్రంపేటకు చేరుకుని విక్రయించి లేదా తాకట్టు పెట్టి సొమ్ము చేసుకుంటాడు.


