గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
వెలుగోడు: బోయరేవుల గ్రామ సమీపంలో గాలేరు వాగులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. వాగులో సుమారు 50–55 ఏళ్ల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం నీటిలో తెలియాడుతూ కనిపించించడంతో మోత్కూరు గ్రామ వీఆర్‌వో షేక్ మహబూబ్ బాషా వెలుగోడు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని బయటకు తీసి పంచనామా చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ సురేష్ తెలిపారు.
కుక్కల దాడిలో
ఐదు పొట్టేళ్లు మృతి
శిరివెళ్ల: యర్రగుంట్లలో మంగళవారం కుక్కల దాడిలో ఐదు పొట్టేళ్లు మృతి చెందాయి. మరో రెంటింటికి తీవ్ర గాయాలయ్యాయి. ఎల్లమ్మపేటకు చెందిన గొర్రెల యజమాని మందపై కుక్కలు ముక్కుమ్మడి దాడి చేశాయి. ఈ దాడి వలన యజమానికి రూ. లక్ష వరకు నష్టం వాటిల్లింది. గాయపడిన వాటికి పశు వైద్యాధికారి దస్తగిరి చికిత్స చేశారు. గ్రామంలో కుక్కల సంచారం అధికమయ్యాయని నిరోధించాలని పంచాయతీ అధికారులను గ్రామస్తులు కోరారు.
సహకార సంఘాల ఉద్యోగుల పదవీ విరమణ
62 ఏళ్లకు పెంచాలి
కర్నూలు(సెంట్రల్): వ్యవసాయ సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. మంగళవారం సీఆర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యూటీ సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతోపాటు ఆరోగ్య బీమా కింద రూ.5 లక్షలు ఇవ్వాలన్నారు. అంతేకాక ప్రతి ఉద్యోగికి రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని చేయించాలన్నారు. జీఓ నంబర్ 36 ప్రకారం కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగులర్ చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు, కల్లూరు మండల రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణానాయక్, బి.రాముడు పాల్గొన్నారు.
గుర్తుతెలియని
వ్యక్తి దుర్మరణం
డోన్ టౌన్: పట్టణ సమీపంలోని యు.కొత్తపల్లె గ్రామం బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ ఎస్‌ఐ శరత్ కుమార్ రెడ్డి మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి మతిస్థిమితం లేని ఒక వ్యక్తి రోడ్డుపై తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లింది. కింద పడిన వ్యక్తిపై మరికొన్ని వాహనాలు వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం


