పద్మవ్యూహాన్ని ఛేదించేదెవరు?
● మహాభారతంలో కౌరవులు పన్నిన పద్మవ్యూహం గురించి అందరికీ తెలిసిందే. అంత్యంత దుర్బేధ్యమైన వ్యూహంలో లోపలికి వెళ్లే కొద్ది తిరిగి రాలేని పరిస్థితి. ఇప్పుడు ఇందంతా ఎందుకంటారా.. గ్రామ రచ్చ కట్ట బండపై ప్రజలు సరదాగా బారకట్ట, పులి జూదం, చెర్‌పర్.. తదితర ఆటలు ఆడుతూ కనిపిస్తారు. కలుగొట్ల గ్రామ రచ్చకట్ట బండపై చెక్కిన పద్మవ్యూహాన్ని పూర్తి చేయాలంటే ఎంతో మేధస్సు ఉండాలి. ఈ పద్మవ్యూహం లోనికి వెళ్లాలంటే ముందు ప్రారంభం గుర్తించాలి. వేలి ద్వారా ప్రారంభిస్తే మధ్యలో వెనుదిరగాల్సిందే. ఓ బలపం లాంటిది తీసుకుని ఆట ప్రారంభించాలి. లోపలికి వెళ్లేందుకు ఏడు దారులున్నాయి. ఎటు నుంచి వెళ్తే గమ్యం చేరుకుంటామో తెలియని పరిస్థితి. 1996లో సి. బెళగల్ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గ్రామంలో ఉంటూ అందరికీ సుపరితుడయ్యాడు. అతడు ఈ వ్యూహాన్ని ఈ రచ్చకట్టపై కొండ బలపంతో గీయగా గ్రామస్తుడైన కేశవయ్య చెక్కినట్లు ప్రజలు చెబుతున్నారు. చిక్కుముడి పక్కనే చెక్కిన తేదీ కూడా ఉంది. ఈ రచ్చకట్టపై కూర్చున్న వారు ఎవరైనా ఈ పద్మవ్యూహాన్ని చూస్తే ఆసక్తిగా ఒకసారైనా ప్రయత్నం చేయక మానరు. – వెల్దుర్తి


