మార్కెట్‌లో నకిలీ మందులను అరికట్టండి
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో నకిలీ మందులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆదేశించారు. స్థానిక ప్రాంతీయ కంటి ఆసుపత్రి సమీపంలో నూతనంగా రూ.2.78 కోట్ల వ్యయంతో నిర్మాణం చేసిన డిప్యూటీ డైరెక్టర్, డ్రగ్ కంట్రోల్, రీజనల్ లేబరేటరీ భవనాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఔషధ దుకాణ యజమానులతో కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి మాట్లాడుతూ ఔషధ దుకాణాలలో నకిలీ మందులను, కాలం చెల్లిన మందులను విక్రయించరాదన్నారు. ప్రజలు యాంటిబయాటిక్స్‌ను అధిక మోతాదులో, వారి ఇష్టానుసారం దుకాణాల నుంచి కొని, వీటిని అధిక మోతాదులో వాడటం వల్ల రోగనిరోధక శక్తి క్షీణించి, ఇతర రోగాల బారిన పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేనిదే వాటిని విక్రయించరాదని దుకాణ యజమానులను కోరారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, డ్రగ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ నాగకిరణ్‌కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ హరిహరతేజ, డ్రగ్ ఇన్స్‌పెక్టర్ హనుమన్న, జయరామ్ తదితరులు పాల్గొన్నారు.
ప్లానింగ్ లేకుండా నిర్మాణం...!
జిల్లా కలెక్టరేట్‌కు కూతవేట దూరంలో ప్రధాన రహదారి పక్కన 15 సెంట్ల విస్తీర్ణంలో నిర్మించిన డ్రగ్ కంట్రోల్ కార్యాలయం సరైన ప్లానింగ్ లేకపోవడంతో అస్తవ్యస్తంగా నిర్మించారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రూ.2.78 కోట్లతో నిర్మించిన ఈ భవనానికి కనీసం ప్రహరీ లేకపోవడం, భవనం వెనుకవైపున పార్కింగ్‌కు స్థలం కేటాయించడం, దానికి కూడా గేటు ఏర్పాటు చేయడంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీ ప్లస్ 2 పద్ధతితో నిర్మించిన ఈ భవనంలో కింద అధికారుల చాంబర్లు, మొదటి అంతస్తులో ల్యాబ్‌కు సంబంధించిన గదులు, రెండో అంతస్తులో ల్యాబోరేటరీ పరికరాలు ఉన్నాయి. అన్నీ ఇరుకు ఇరుకుగా, చిన్నవిగా గదులు నిర్మాణం చేశారు. అలాగాకుండా పార్కింగ్ కోసం సెల్లార్ ఏర్పాటు చేసి, మొదటి, రెండు అంతస్తుల్లో కార్యాలయం, ల్యాబరేటరీ నిర్మాణం చేసి ఉంటే గదులు కూడా పెద్దగా వచ్చేవని, ఇలాంటి నిర్మాణానికి అధికారులు ఎలా అనుమతించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


