ప్రత్యేక బస్సులో వైద్యులకు శిక్షణ
కర్నూలు(హాస్పిటల్): జాన్సన్ అండ్ జాన్సన్ ఇన్‌స్టిట్యూట్ ఆన్ వీల్ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులో వైద్య విద్యార్థులకు స్కిల్‌ల్యాబ్ ఏర్పాటు చేశారు. ఈ వాహనం సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు చేరుకుంది. రెండు రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణను కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, వైద్యకళాశాలల్లో ఈ వాహనం ద్వారా ల్యాపరోస్కోపిక్ శస్త్రచికిత్సా పద్ధతులపై వైద్య విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ(లైవ్ టిష్యూ, స్టిములేటర్స్–ట్యూబింగెన్ మోడల్) ఇస్తున్నట్లు తెలిపారు. బస్సులో పలు రకాల కుట్లకు సంబంధించిన శిక్షణ, ల్యాపరోస్కోపిక్ ఆపరేషన్‌లకు సంబంధించిన శిక్షణ, పేగుల ఆపరేషన్‌లో ఉపయోగించే స్టాప్లర్‌లు అనేక ప్రత్యేక పరికరాలపై శిక్షణ ఇస్తారన్నారు. శిక్షణతో నైపుణ్యాలను మెరుగుపరచుకుని రోగులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జాన్సన్ అండ్ జాన్సన్ రీజనల్ మేనేజర్ ఎం.మురళీకృష్ణ, జగదీష్, రిషికుమార్, జనరల్ సర్జరీ విభాగ వైద్యులు, పీజీలు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.


