పొలాల మధ్య మైనింగ్‌కు ఒప్పుకోం
వెల్దుర్తి: ‘మా పంట పొలాల మధ్య మైనింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం’ అంటూ మండల పరిధిలోని బుక్కాపురం, లింగాల పల్లె గ్రామాల రైతులు స్పష్టం చేశారు. మైనింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ఇటీవల పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సోమ వారం ఆయా గ్రామాల రైతులు, పార్టీలకతీతంగా నాయకులు శంకర్ రెడ్డి, ఈశ్వర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, చిన్నమద్దిలేటి, బసవయ్య, గోపాల్ రెడ్డి తదితరులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. తమకు సమాచారం అందించకుండా తమ పొలాల మధ్య గల సర్వే నంబరు 214లోని 4.5 హెక్టార్లలో ఇన్ఫినిటి మినరల్స్ వారు క్వార్ట్జ్ మైనింగ్ ఏర్పాటుకు ఈనెల 6న పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిపారన్నారు. ఈ ప్రక్రియను ఆర్‌డీఓ, తహసీల్దార్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్వహించడం సరికాదన్నారు. దొడ్డిదారిన అనుమతు లు పొందేందుకు ప్రయత్నిస్తున్న కంపెనీకి కొందరు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అనంతరం మైనింగ్ పరిశ్రమ ఏర్పాటును ఆపాలంటూ డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.


