అబ్బురపరిచే ఆళ్లగడ్డ రాతి చిత్రాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తయారవుతున్న రాతి చిత్రాలకు ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు ఉంది. ఇక్కడ చేతులతో చెక్కుతున్న రాతి బొమ్మలు, దేవతామూర్తుల విగ్రహాలు దేశంలోని తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. తెలంగాణలోకి యాదగిరిగుట్టలోని దేవతామూర్తుల చిత్రాలు ఆళ్లగడ్డ శిల్పుల చేతుల నుంచి జాలువారినవి కావడం విశేషం. ఈ రాత్రి చిత్రాలకు మరింత గుర్తింపు రావాలంటే శిల్పారామం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
కర్నూలు(అగ్రికల్చర్): ఒకవైపు రాతి బొమ్మలు, మరోవైపు గద్వాల పట్టుచీరలు, ఇంకోవైపు కలంకారీ పెయింట్‌లో రాణింపు ఒక్క మాటలో చెప్పాలంటే హస్తకళలకు ఉమ్మడి కర్నూలు జిల్లా నెలవు. శిల్పారామం ఏర్పాటై ఉంటే ఈ అపురూప కళలకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించేది. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జాతీయ హస్తకళల వారోత్సవాల (నేషనల్ హ్యాండీక్రాప్ట్ వీక్) నేపథ్యంలో కర్నూలు కొండారెడ్డిబురుజు సమీపంలోని లేపాక్షి హ్యాండీక్రాప్ట్ ఎంపోరియంలో హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేశారు.
కలంకారీ పెయింటింగ్‌లో అద్భుతాల సృష్టి
బనగానపల్లి మండలం టంగుటూరు గ్రామానికి చెందిన 69 ఏళ్ల శివానందరెడ్డి 46 ఏళ్లుగా కలంకారీ పెయింటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నారు. వేలాది చిత్రాలు ఈయన చేతుల నుంచి ఇప్పటికే జాలువారాయి. భారతీయ ఇతిహాసాల మీద ఈయన కలంకారీ పెయింటింగ్స్ వేయడం ప్రత్యేకత. ఈయన ప్రతిభకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 13 అవార్డులు లభించాయి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, మాజీ ముఖ్యమంత్రులు ఎన్‌టీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖల నుంచి నుంచి ఆయన అభినందనలు అందుకున్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కూడా లభించింది.
పట్టుచీరలకు పుట్టినిల్లు
కర్నూలు జిల్లా చేనేత పట్టుచీరలకు పుట్టినిల్లు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పట్టుచీరలను గద్వాల పట్టుచీరల పేరుతో మార్కెటింగ్ చేస్తున్నారు. విదేశాల్లో వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రవాసాంద్రులు, ప్రవాస భారతీయుల మహిళలు వీటిపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తీసుకున్న చొరువతో ఒక ఉత్పత్తి కింద 2023లో జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. దీని ద్వారా భౌగోళిక గుర్తింపు లభించడంలో కదలిక వచ్చింది. ఇటీవలనే కేంద్రం నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ చేనేత పట్టుచీరల ఉత్పత్తిని అధ్యయనం చేసింది.
కార్యరూపం దాల్చని
శిల్పారామం ఏర్పాటు
హస్తకళలకు గుర్తింపు తీసుకరావడం కోసం కర్నూలులో శిల్పారామం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికి కార్యరూపం దాల్చలేదు. 2014–15 నుంచి 2018–19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు శిల్పారామానికి జగన్నాథగట్టులో భూమి కేటాయించినట్లే కేటాయించి తర్వాత ఇతర అవసరాలకు మళ్లించారు. ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శిల్పారామం లేకపోవడంతోనే హస్తకళలకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
జిల్లాలోని పట్టుచీరలు,
ఆళ్లగడ్డ రాతి చిత్రాలు జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు
కలంకారీ పెయింటింగ్‌లో రాణిస్తున్న
శివానందరెడ్డి
జాతీయ హస్తకళల
వారోత్సవాలు ప్రారంభం
అబ్బురపరిచే ఆళ్లగడ్డ రాతి చిత్రాలు


