ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు రూ.4.91 లక్షల జరిమానా
డోన్ టౌన్: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు డోన్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ క్రాంతికుమార్ రూ.4.91 లక్షల జరిమానా విధించారు. సోమవారం డోన్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా అనంతపురం వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ట్రావెల్ పాయింట్ బస్సు నిలిపారు. అయితే డ్రైవరు బస్సు ఆపకుండా వెళ్లడంతో అధికారిలో కారుతో వెంబడించి జగదుర్తి సమీపంలో అడ్డుకున్నారు. పర్మిట్‌లు చూపించమని డ్రైవర్‌ను అడుగగా అధికారిపై దురుసుగా వ్యవహరిస్తూ ఎలాంటి పత్రాలు చూపలేదు. వెంటనే ఆన్‌లైన్‌లో పరిశీలించగా ఎలాంటి రోడ్డు టాక్స్‌లు చెల్లించడం లేదని గుర్తించి బస్సును సీజ్ చేశారు. జరిమానా కింద రూ. 4.91 లక్షలు విధించినట్లు ఎంవీఐ తెలిపారు.


