కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
కర్నూలు: పెండింగ్ కేసులను లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అధికారులకు సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు జిల్లా న్యాయ సేవా సదన్‌లో సోమవారం లీలా వెంకటశేషాద్రి మున్సిపల్, సచివాలయ అధికారులతో డిసెంబర్ 13న జరగనున్న జాతీయ లోక్‌అదాలత్‌పై సమీక్షించారు. కోర్టులలో ఉన్న సివిల్ కేసులు, భూసేకరణ కేసులు, ట్యాక్స్ కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉన్న కోర్టులలో ప్రతిరోజూ ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని వినియోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలని కోరారు. మున్సిపల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.


