కొడుకు మరణాన్ని తట్టుకోలేక..
పాములపాడు/జూపాడుబంగ్లా: కన్నకొడుకు బలవన్మరణాన్ని తట్టుకోలేక ఓ వృద్ధురాలు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సోమవారం జూపాడుబంగ్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...జూపాడుబంగ్లా క్వార్టర్స్‌లోని పింజరిపేటలో ఏసమ్మ అనే మహిళ కొడుకు సునీల్ (22)తో కలిసి నివాసం ఉంటుంది. ఈమెది స్వగ్రామం నందికొట్కూరు మండలం వడ్డెమాను. భర్త మరణం తర్వాత దాయాదులతో గొడవపడి జూపాడుబంగ్లాకు వచ్చి స్థిరపడింది. అయితే, కొన్నాళ్ల నుంచి స్వగ్రామానికి వెళ్లాలని కుమారుడు ఏసమ్మపై ఒత్తిడి పెంచాడు. తాగి వచ్చి వేధిస్తున్నా సర్దిచెబుతూ వెళ్లేది. ఆదివారం అనంతపురం జిల్లా గుత్తిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థన ఉందని ఏసమ్మ వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేలోపు కుమారుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసి బోరున విలపిస్తూ ఇస్కాల –కంబాలపల్లి గ్రామాల మధ్య ఉన్న సూపర్ ప్యాసేజ్ వంతెన పై నుంచి ఎస్‌ఆర్‌ఎంసీలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అటుగా వెళ్తున్న ఇస్కాల గ్రామానికి చెందిన నాగలక్ష్మి రెడ్డి అనే వ్యక్తి గమనించి గట్టిగా కేకలు వేయడంతో కాలువలో చేపలు పడుతున్న మత్స్యకారులు పుట్టీ సాయంతో ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో జీర్ణించుకోలేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు వృద్ధురాలు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కొడుకు మరణాన్ని తట్టుకోలేక..


