కొలిమిగుండ్లలో రాయల్టీ చెక్‌పోస్టు ఏర్పాటు
కొలిమిగుండ్ల: నాపరాళ్ల రవాణకు రాయల్టీ వసూలు చేసే బాధ్యత ప్రవేట్ సంస్థకు అప్పగించడంతో అడుగడుగునా ప్రైవేట్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం కొలిమిగుండ్లలోని విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదురుగా చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. బెలుం సమీపంలోని నాపరాతి గనుల నుంచి ట్రాక్టర్ లోడ్ చేసుకొని వెళుతున్న సమయంలో సిబ్బంది ఆపినా నిలపక పోవడంతో బైక్‌లో వచ్చి ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. రాయల్టీ చెల్లించి రవాణ చేయాలని యజమానికి సూచించారు. కొలిమిగుండ్ల, ఇటిక్యాల, కనకాద్రిపల్లె, రాఘవరాజుపల్లె గ్రామాల్లో వందకు పైగానే పాలీష్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. కొలిమిగుండ్లలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయకముందు బెలుం, బెలుం శింగవరం గ్రామాల్లోని నాపరాతి గనుల నుంచి రవాణ చేసే ట్రాక్టర్లు రాయల్టీలు లేకుండా పోతుండేవి. గమనించిన ప్రైవేట్ సంస్థ ఇక్కడ చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. దీంతో యజమానులు తప్పక రాయల్టీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క వాహనం కూడ రాయల్టీ లేకుండా వెళ్లేందుకు లేకుండా పలు చోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. బెలుం–బెలుం శింగవరం మధ్యలో, కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు క్రాస్ రోడ్డు, బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేయగా తాజాగా కొలిమిగుండ్ల విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసి 24 గంటల పాటు సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.ప్రైవేట్ సంస్థ నెలకు రూ.14.5 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి రావడంతో పక్బడందీగా వసూలు చేస్తున్నారు.


