నేడు, రేపు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పర్యటన
కర్నూలు(సెంట్రల్): మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ సోమ, మంగళవారాల్లో జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం కర్నూలు చేరుకొని బాలసదన్‌ను పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం కర్నూలులోని శక్తి సదన్‌కు వెళ్లి పరిశీలన చేస్తారు.
విత్తన చట్టాలకు వ్యతిరేకంగా నేడు నిరసన
కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విత్తన, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం, జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ, రైతు కూలీ సంఘం నాయకులు వెంకటస్వామి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని దండగ చేసి రైతులను అప్పుల పాలు చేస్తున్నారని ఆరోపించారు. విదేశీ వ్యాపారులకు లాభం చేకూర్చేల విత్తన, విద్యుత్ చట్టాలను తీసుకురావడం అన్యాయమన్నారు. ఇప్పటికే 66 విత్తన చట్టాలు ఉన్నాయని, వాటిని కాదని కొత్త చట్టం ఎందుకని ప్రశ్నించారు.
రేపు ‘స్వర్ణామృత’ పంపిణీ
ఆదోని అర్బన్: పట్టణంలోని అభయాంజనేయస్వామి ఆలయ ఆవరణలో ఈనెల 9వ తేదీ(మంగళవారం) స్వర్ణామృత ప్రాసనం మందును పంపిణీ చేస్తున్నట్లు అవోపా మాజీ అధ్యక్షుడు కాకుబాళ్ నగేష్, ఆదోని అవోపా పట్టణాధ్యక్షుడు వంకదారు శ్రీనాథ్‌గుప్తా ఆదివారం తెలిపారు. ఆరు నెలల నుంచి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఈ మందును అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ ఔషధం రోగ నిరోధకశక్తిని పెంచుతుందన్నారు. వివరాలకు 9849478178 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
కర్నూలు(సెంట్రల్): తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి.రామకృష్ణ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎకరాకు 30 క్వింటాల దిగుబడి వస్తుండడంతో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.2,450 ఇస్తే సరిపోదన్నారు. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా రావన్నారు. కనీసం రూ.5 వేలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయంపై కలెక్టర్ దృష్టి సారించాలని సూచించారు.
నేడు ‘డయల్ యువర్
సీఎండీ’
కర్నూలు(అగ్రికల్చర్): డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు సోమవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు 8977716661 నంబరుకు ఫోన్‌చేసి సమస్యల గురించి చెప్పవచ్చని పేర్కొన్నారు.
కర్నూలు(సెంట్రల్): ఏపీ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా వై.నాగేశ్వరరావు మూడోసారి ఎన్నికయ్యారు. ఆదివారం ఆ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రమేష్‌బాబు సమక్షంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా వై.నాగేశ్వరరావును జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్లు మద్దతు తెలపడంతో ఆయన ముచ్చటగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన 2017 నుంచి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తాజాగా మరోసారి ఎన్నిక కావడంతో ధ్రువపత్రాన్ని అందజేసి శాలువా కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి మూడోసారి గెలిపించిన డ్రైవర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పాపారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంకోబా, నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఖాదర్, కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి మబ్బులు తదితరులు పాల్గొన్నారు.


