ఉద్యోగ భద్రత కోసం ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): ఉద్యోగ భద్రత కల్పించాలని 104 ఉద్యోగులు ఆదివారం కర్నూలులో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్మిక, కర్షక భవన్‌లో 104 ఉద్యోగుల సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ అంజిబాబు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడారు. అరబిందో కంపెనీ నుంచి బకాయి లు విడుదల చేయాలన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లకు కనీసం రూ.18,500 వేతనం ఇవ్వాలని, ప్రతి డివిజన్‌కు ఒక బఫర్ సిబ్బందిని నియమించాలని కోరారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షు డు పీఎస్ రాధాకృష్ణ, యూనియన్ నాయకులు ఇలియాజ్, మల్లికార్జున, బొజ్జప్ప, ఈరన్న, రాఘవేంద్ర, అశోక్, అయ్యప్ప, ఓబులేసు పాల్గొన్నారు.
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
కోసిగి: మండల కేంద్రం కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి బీదర్(16577) వెళ్లే రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే హెడ్‌కానిస్టేబుల్ శివరామయ్య తెలిపారు. మృతుడి వద్ద ఆధార్ కార్డు ఆధారంగా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా ఆరోలి గ్రామానికి చెందిన తిమ్మప్ప(45) అనే వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పారు. అనారోగ్యంతో రాయచూరు ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా, జబ్బు నయకం కాగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. మృతదేహాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అందజేసినట్లు చెప్పారు.
వివాహిత బలవన్మరణం
వెల్దుర్తి: మండల పరిధిలోని ఎల్ నగరం గ్రామానికి చెందిన సుహాసిని(32) శనివారం అర్ధరాత్రి (తెల్లారితే ఆదివారం) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన భర్త కురువ చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు హుటాహుటిన వెల్దుర్తి సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యానికి కర్నూలు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మద్యానికి బానిసైన భర్త కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న క్షణికావేశంలో తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందంటూ మృతురాలి తల్లి భాగ్యలక్ష్యి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. సుహాసినికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
భర్తపై కేసు నమోదు
కొలిమిగుండ్ల: కుమారుడిని తీసుకొని వెళ్లేందుకు వచ్చిన భార్యపై దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ రమేష్‌బాబు ఆదివారం తెలిపారు. ఉమ్మాయిపల్లెకు చెందిన భూషిపల్లె లక్ష్మీనారాయణరెడ్డికి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన అన్నెం సుధారాణితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అనివార్య కారణాల వల్ల మూడేళ్ల నుంచి దంపతులిద్దరు వేరుగా ఉంటున్నారు. వారం రోజుల క్రితం కుమారుడు పుట్టిన రోజు ఉండటంతో భర్త ఆళ్లగడ్డకు వెళ్లాడు. అక్కడి నుంచి చిన్న కుమారుడిని వెంట తీసుకొని ఉమ్మాయిపల్లెకు వచ్చాడు. కుమారుడిని తీసుకొని పోయేందుకు సుధారాణి ఉమ్మాయిపల్లెలోని ఇంటికి చేరుకోగానే భర్తతో పాటు అతని బంధువులు దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.


