రూ. 10 వేల వేతనం.. పక్కా మోసం
● కలుపు తొలగింపులో కాడెద్దుగా మారిన వలంటీర్
గ్రామ పరిపాలనను వికేంద్రీకరణ చేస్తూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయ, వలంటీర్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చించి. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడపకు చేరేలా చర్యలు చేపట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతోపాటు నెలకు రూ. 10 వేలు వేతనం అందజేస్తామని 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా వలంటీర్ వ్యవస్థను పట్టించుకోలేదు. గతంలో వలంటీర్లుగా పనిచేసిన వారంతా జీవనోపాధి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కోవెలకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఐదేళ్లపాటు వలంటీర్‌గా పనిచేసిన రాజేష్ వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న పొలంలో ఈ ఏడాది శనగ పంట సాగు చేయగా చిన్నపాటి గుంటిక సాయంతో తానే స్వయంగా కలుపు నివారణ పనుల్లో నిమగ్నమయ్యాడు. – కోవెలకుంట్ల


