జీజీహెచ్‌లో అఖిల భారత సర్వీసుల అధికారులు
కర్నూలు(హాస్పిటల్): అఖిల భారత సర్వీసుల అధికారుల బృందం గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించింది. తెలంగాణ రాష్ట్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 15 మందితో కూడిన బృందం(ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐసీఏఎస్, ఐఎస్‌ఎస్) శిక్షణ నిమిత్తం కొద్దిరోజులుగా జిల్లాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆసుపత్రిలోని ఓపీ, ఐపీ సేవలను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్యసేవలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లభిస్తున్న వైద్యపరికరాలు, సదుపాయాల గురించి సమగ్రంగా తెలుసుకున్నారు. వారికి ఆసుపత్రి కార్యకలాపాలు, సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాల గురించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించారు. వారి వెంట ఆసుపత్రి ఆర్‌ఎంఓ డాక్టర్ వెంకటరమణ, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ కిరణ్‌కుమార్ ఉన్నారు.


