ఈ నెల కొత్త పింఛన్లు లేవు
కర్నూలు(అగ్రికల్చర్): నవంబరు నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరగనుంది. జిల్లాలో 2,37,904 పింఛన్లకు రూ.103.82 కోట్లు విడుదల అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 17 నెలలు అవుతోంది. ఇప్పటి వరకు కొత్త పింఛన్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. కనీసం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. దీనిపై కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 2024 ఎన్నికల సమయంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎప్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని టీడీపీ నేతలు ఊరువాడా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఈ ఊసే లేకుండా పోయింది. కొత్త పించన్‌లు ఇవ్వకపోగా.. ఉన్న వాటిని అడ్డుగోలుగా తొలగిస్తుండటం పట్ల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
నేటి నుంచి అఖిల భారత సర్వీసు అధికారుల పర్యటన
కర్నూలు(సెంట్రల్): గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల పనితీరును పరిశీలించేందుకు జిల్లాకు 15 మంది అఖిల భారత సర్వీసు అధికారులను కేటాయించారు. ఇందులో ఒక్కరు ఐఈఎస్, ముగ్గురు ఐఎస్‌ఎస్, ఇద్దరు ఐసీఏఎస్, ఏడుగురు ఐఎఫ్‌ఎస్, ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో శిక్షణలో ఉన్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని గ్రామపంచాయతీలు, మునిసిపాలిటీల్లో పనితీరును నవంబర్ 1 నుంచి 8వ తేదీ వరకు పరిశీలించి తిరిగి వారికి కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్టును నమోదు చేస్తారు.
కొత్త పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు తెలపాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన 240 పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. సిరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల ప్రతిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రావడంతో 240 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. వీటిపై రాజకీయ పార్టీలు ఏమైనా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. ఇప్పటికే ఉన్న 2,203 కేంద్రాలకు కొత్త కేంద్రాలు అదనమన్నారు. కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళీ పాల్గొన్నారు.
ఆదోని టౌన్: బస్సులు నడపాలని విద్యార్థులు శుక్రవారం ఆదోని ఆర్టీసీ డిపో ఎదుట రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ డిపో అసిస్టెంట్ మేనేజర్ మల్లికార్జునకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఢణాపురం ఉదయ్‌బాబు మాట్లాడుతూ.. వివిధ గ్రామాల నుంచి అనేక మంది విద్యార్థులు కళాశాలలకు, పాఠశాలలకు చదువుకోవడానికి ఆదోని పట్టణానికి వస్తుంటారన్నారు. బస్సులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యార్థులతో టూటౌన్ ఎస్‌ఐ రామ్‌నాథ్ మాట్లాడటంతో ధర్నా విరమించారు.
							ఈ నెల కొత్త పింఛన్లు లేవు

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
