కిలో టమాట రూ.50
కర్నూలు(అగ్రికల్చర్): రిటైల్ మార్కెట్‌లో టమాట ధర అమాంతం పెరుగుతోంది. కర్నూలు రైతుబజారులో ఎలాంటి నాణ్యత లేని టమాట కిలో ధర రూ.26 పలుకుతోంది. బయటి వ్యాపారులు కిలో రూ.50 పైనే విక్రయిస్తున్నారు. రైతులకు మాత్రం టమాట ధర సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. సోమవారం పత్తికొండ మార్కెట్‌లో క్వింటా టమాటకు కనిష్టంగా రూ.1,200.. గరిష్టంగా రూ.2వేల ధర మాత్రమే లభించింది. సగటు ధర రూ.1,600 నమోదైంది. మార్కెట్‌లో టమాటకు డిమాండ్ ఉన్నప్పటికీ వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ మార్కెటింగ్ శాఖ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. వినియోగదారులను మాత్రం టమాట ధరలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అంతంత మాత్రం వచ్చిన దిగుబడులు కూడా హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు తరలిపోవడంతో స్థానికంగా టమాటకు కొరత ఏర్పడుతోంది. రానున్న రోజుల్లో టమాట ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
