వెల్ఫేర్ సొసైటీలో సభ్యత్వం తీసుకోండి
కర్నూలు(అర్బన్): జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు నవంబర్ 23న జరగనున్న దృష్ట్యా, సొసైటీలో సభ్యత్వం తీసుకోని ఎక్స్ సర్వీస్‌మెన్స్ ఈ నెల 31లోగా తీసుకోవాలని ఎన్నికల కమిటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి కోరారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్‌మెన్ సొసైటీకి నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. నవంబర్ 9న నామినేషన్లను దాఖలు, 12న పరిశీలన, ఉపసంహరణ ఉంటుందని, అభ్యర్థుల అవగాహన సమావేశాన్ని 13న నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 23న ఓటింగ్, ఓట్ల లెక్కింపు కార్యక్రమాలతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. సీనియర్ సభ్యులు పురుషోత్తం మాట్లాడుతూ ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామన్నారు. సమావేశంలో సీనియర్ సభ్యులు కేడీవీఎం రెడ్డి, వాసు, ప్రసాద్, గోవర్దన్, రవీంద్ర పాల్గొన్నారు.
పోరాటాలకు సిద్ధం కావాలి
నంద్యాల(న్యూటౌన్): కనీస వేతనం, హెచ్‌ఆర్ పాలసీ అమలు కోసం పోరాటాలకు సిద్ధం కావాలని వీఓఏల సంఘంం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రూపాదేవి, ధనలక్ష్మి సూచించారు. స్థానిక జేకే ఫంక్షన్ హాల్‌లో వీఓఏల సంఘం రాష్ట్ర మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు రాష్ట్ర వీఓఏల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులతో పాటు 13 మంది రాష్ట్ర ఆఫీసు బేరర్లను, 43 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులు వీఓఏలపై రాజకీయ వేధింపులు అరికట్టాలని, ఆన్‌లైన్ పని భారాన్ని తగ్గించాలని, 5జీ మొబైల్స్, సిమ్ కార్డ్స్, రెండేళ్ల సీ్త్రనిధి ఇన్‌సెంటివ్స్ ఇవ్వాలని, రూ.10 లక్షల గ్రూప్ ఇన్సురెన్స్ కల్పించాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని తీర్మానించారు. వీటి సాధనకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. మహా సభల్లో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్నాల తిరుపతయ్య, నాయకులు పుల్లా నరసింహులు, లక్ష్మణ్, తోట మద్దులు, గౌస్, బాలవెంకట్, తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రోడ్డులో ప్యాలకుర్తి గ్రామ సమీప పొలాల్లో మంగళవారం అనుమానాస్పద స్థితిలో దేవనకొండ మండలం పి.కోటకొండ గ్రామానికి చెందిన కమ్మరి దస్తగిరి ఆచారి (38) మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దస్తగిరి ఆచారికి చెల్లెలిచెలిమ గ్రామానికి చెందిన వరలక్ష్మితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. మృతుడి భార్య వరలక్ష్మి పి.కోటకొండ గ్రామంలో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. కాగా వివాహమైనప్పటి నుంచి భార్య భర్తలిద్దరూ తరచూ గొడవపడుతూ ఉండేవారు. ఈనేపథ్యంలో 4 నెలల క్రితం వరలక్ష్మి ఆశా వర్కర్ ఉద్యోగాన్ని రూ.2 లక్షలకు ఇతరులకు అమ్ముకుని, భర్తను వదిలేసి కర్నూలు చేరి అక్కడే జీవనం సాగిస్తోంది. అనంతరం మృతుడు దస్తగిరి కూడా కర్నూలు వెళ్లి భార్యతో రాజీపడి అక్కడే కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దస్తగిరి 15 రోజుల క్రితం కారుకు డ్రైవర్‌గా బళ్లారికి వెళ్లి అక్కడి నుంచి పలుమార్లు ఫోన్ చేసినా భార్య స్పందించలేదు. దీంతో కర్నూలు చేరుకున్న దస్తగిరి భార్య వరలక్ష్మిపై అనుమానంతో మూడు రోజుల నుంచి తీవ్రంగా గొడవపడుతున్నాడు. ఈ విషయంపై సోమవారం రాత్రి వరలక్ష్మి సోదరుడు కమ్మరి మధు, పెద్దమ్మ కుమారుడు వీరేష్‌లిద్దరూ కలిసి మృతుడు దస్తగిరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఏమి జరిగిందో తెలియదు కానీ దస్తగిరి ప్యాలకుర్తి పొలాల్లో శవమై కన్పించాడు. కాగా భార్య సోదరులు కమ్మరి మధు, వీరేష్‌లతో కలిసి తమ కుమారుడు దస్తగిరి ఆచారిని దారుణంగా కొట్టి, గొంతుకు ఉరేసి చంపి ఇక్కడ పడేశారంటూ మృతుడి తండ్రి వెంకటరాముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోడుమూరు ఇన్‌చార్జ్ సీఐ మన్సురుద్దీన్, ఎస్‌ఐ ఎర్రిస్వామి తెలిపారు.
							వెల్ఫేర్ సొసైటీలో సభ్యత్వం తీసుకోండి
							వెల్ఫేర్ సొసైటీలో సభ్యత్వం తీసుకోండి

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
