మనవడిని చూడకుండానే మృత్యుఒడికి!
● ఆర్టీసీ బస్సును లారీ ఢీకొని మహిళ మృతి ● మరో 16 మందికి గాయాలు 
అవుకు(కొలిమిగుండ్ల): కోడలు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరగా చూసేందుకని బయలుదేరిన ఓ మహిళ.. మార్గమధ్యలో మృత్యుఒడికి చేరింది. ఉప్పల పాడు ఆర్చీ సమీప మలుపు రోడ్డులో మంగళవారం ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో అవుకు మండలం శివవరానికి చెందిన చాకలి లక్ష్మీదేవి(55) మృతిచెందగా మరో 16 మంది గాయాలపాలయ్యారు. ప్రయాణికులు తెలిపిన వివరాలు.. బనగానపల్లె డిపో హైర్ బస్సు 36 మందికి పైగా ప్రయాణికులను ఎక్కించుకుని తాడిపత్రికి బయలుదేరింది. ఆర్చీ సమీపాన ఉన్న శ్రీకృష్ణుడి గుడి వద్దకు చేరుకోగా మలుపులో బనగానపల్లె వైపు వెళ్తున్న లారీ బస్సును ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మీదేవి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. బస్సు డ్రైవర్ కనకాద్రిపల్లెకు చెందిన నాగరాజు, అంకిరెడ్డిపల్లె లక్ష్మీనారాయణమ్మ, అవుకు కృష్ణవేణమ్మ, గోర్లగుట్టకు చెందిన లక్ష్మీదేవి, పునీత్, చౌడమ్మ, నడిపి సుబ్బరాయుడు, అనంతపురం జిల్లా యల్లనూరుకు చెందిన నాగేంద్రతో పాటు మరో ఎనిమిది మంది గాయపడ్డారు. లక్ష్మీదేవి మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీయాల్సి వచ్చింది. ఈమె కోడలు సుకన్య (కుమారుడి భార్య) పురిటి నొప్పులతో తాడిపత్రి ఆసుపత్రిలో చేరిందని బంధువులు ఫోన్ చేయడంతో చూసేందుకని వెళ్లి ప్రమాదం బారిన పడింది. కాగా లక్ష్మీదేవి మృతి చెందిన కొద్ది నిమిషాలకే కోడలు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనవడిని చూడకుండానే పోయావా అంటూ కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంట తడిపెట్టింది. బనగానపల్లె రూరల్ సీఐ మంజునాథరెడ్డి, అవుకు ఎస్‌ఐ రాజారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన నలుగురిని కుటుంబ సభ్యులు నంద్యాల, కర్నూలుకు తీసుకెళ్లారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ తీవ్రంగా గాయపడిన గోర్లగుట్ట లక్ష్మీదేవి
							మనవడిని చూడకుండానే మృత్యుఒడికి!
							మనవడిని చూడకుండానే మృత్యుఒడికి!

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
