శ్రీశైలం నంద్యాల జిల్లాలోనే కొనసాగాలి
నంద్యాల(అర్బన్): రాయలసీమకు ప్రాణాధారమైన శ్రీశైలంను నంద్యాల జిల్లాలోనే కొనసాగించాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన ముఖ్యనాయకులతో కలిసి మాట్లాడుతూ.. 12 జ్యోతిర్లింగాలలో ఒకరైన శ్రీశైలం మల్లికార్జునుడు, 18 మహాశక్తి పీఠాలలో ఒకరైన భ్రమరాంబిక దేవి ఒకే సన్నిధిలో వెలసిన ఏకై క క్షేత్రం శ్రీశైలం పుణ్యక్షేత్రమన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కలపాలనే వదంతులతో సీమ వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంటుందన్నారు. 60వేల ఎకరాల భూమిని సీమ ప్రజల త్యాగంతో నిర్మించుకున్నారన్న విషయాన్ని పాలకులు మరువవద్దన్నారు. సీమ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంపై వస్తున్న వదంతులను ప్రభుత్వం ఖండిస్తూ ప్రకటన జారీ చేయాలన్నారు. రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని అత్యంత బాధ్యతగా తీసుకొని శ్రీశైలం సీమలోని నంద్యాల జిల్లా పరిపాలన పరిధిలోనే కొనసాగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు. కార్యక్రమంలో సమితి ఉపాధ్యక్షులు వైఎన్‌రెడ్డి, సభ్యులు సుధాకర్‌రావు పాల్గొన్నారు.


